జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

 


నెల్లూరు, జనవరి 12 (ప్రజా అమరావతి):-- ఈనెల 26వ తేదీన నెల్లూరు నగరంలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనిజిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.


          బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై  జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకలు బాగా జరిగాయని అదే విధంగా ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా సజావుగా జరగాలన్నారు. ఇటీవల సంవత్సర కాలంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగం తయారుచేయుటకు ప్రగతి నివేదికలను  ఈ నెల 19వ తేదీ లోగా ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతిభ కనపరిచిన వారి ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసేందుకు వీలుగా వారి పేర్లను ముందుగా ప్రతిపాదించి పంపాలని ఇందుకోసం ముఖ్యంగా గృహ నిర్మాణం అమలులో చూపిన చొరవను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ అధికారి వారి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ పెరేడ్  మైదానంలో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు హాజరు కావాలన్నారు.  గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కోవిడ్ నిబంధనలను విధిగా పాటిస్తూ పోలీస్ పెరేడ్ మైదానంలో వేదిక ఏర్పాట్లు చేయాలన్నారు  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతోసహా వివిధ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.  వారంతా ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకే హాజరు అయ్యేలాగా పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు.  అలాగే సాయంత్రం శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ పెరేడ్ మైదానం,  శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సజావుగా ఉండేలా చూడాలన్నారు. అంతేగాక ఆహుతులకు ఎలాంటి  తాగునీటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించడం తోపాటు వారికి  ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు,సీటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమం నిర్వహించే రెండు చోట్ల ప్రథమ చికిత్స చేసే విధంగా వైద్య శిబిరాలు  ఏర్పాటుచేసి అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యా సంస్థల నుండి విద్యార్థులు వేడుకలు జరిగే ప్రదేశానికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించే విధంగా ప్రభుత్వ శాఖల ప్రదర్శనశాలలు, శకటాలు ఏర్పాటు చేయాలన్నారు.


 ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్ శ్రీ విధేహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు,డి ఆర్ డి ఎ, డ్వామా పి డి లు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ తిరుపతయ్య, నెల్లూరు,గూడూరు, కావలి,  నాయుడుపేట ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, శ్రీ సీనా నాయక్, శ్రీమతి సరోజినీ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments