నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు
ఫిబ్రవరి నాటికి అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలి
వదన్నవారి ఇళ్లును రద్దు చేయాలి
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
గృహనిర్మాణ ప్రగతిపై సమీక్ష
విజయనగరం, జనవరి 24 (ప్రజా అమరావతి) ః నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అర్హులైన ప్రతీ పేద కుటుంబానీకి ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు మంజూరైన అన్ని ఇళ్లను ఫిబ్రవరి నాటికి నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ తో కలిసి, జెడ్‌పి ఛైర్మన్ శ్రీనివాసరావు తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తూ, ఇళ్ల నిర్మాణ ప్రగతి, నిర్మాణ సామగ్రి లభ్యత, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, ప్రతీ పేదవాడికి సొంత ఇళ్లు మంజూరు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆశయమని అన్నారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా, సంతృప్త స్థాయిలో అర్హత ఉన్నప్రతీ ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే ఇప్పటివరకు మంజూరు చేసిన ఇళ్లను, కట్టుకోవడానికి ముందుకు రాని లబ్దిదారు లనుంచి అంగీకార పత్రం తీసుకొని, వాటిని రద్దుచేసి, వారి స్థానంలో అర్హత ఉన్న మరొకరికి మంజూరు చేయాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, జగనన్న కాలనీలతోపాటు, సొంత స్థలాల్లో ఇళ్లు మంజూరుచేసిన వాటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఇసుక, సిమ్మెంటు, ఇతర నిర్మాణ సామగ్రి కావలసినంత అందుబాటులో ఉందని, బిల్లులు కూడా ఎప్పటికప్పడు జమ అవుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం లక్షా, ఒక వెయ్యి, 358 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో దాదాపు సగం ఇళ్లు సొంత స్థలాల్లో, మిగిలిన సగం లేఅవుట్లలో మంజూరు అయ్యాయని తెలిపారు. అప్రోచ్ రోడ్లు, గొదాముల నిర్మాణం, పెండింగ్ బిల్లుల సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కరించారు. జిల్లాలోని 8 మండలకు ఏఈల కొరతను అధిగమించేందుకు, సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వెంటనే సర్దుబాటు చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని, వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేయాలని ఛైర్మన్ కోరారు.
ఈ సమావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామచంద్రరావు, పిఆర్ ఎస్‌సి గుప్త, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్‌వి రమణమూర్తి, వి.శ్రీనివాసరావు, డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment