విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి,తెలంగాణా సిఎస్ లతో వీడియో సమావేశం.

 విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి,తెలంగాణా సిఎస్ లతో వీడియో సమావేశం.


అమరావతి,12 జనవరి (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఢిల్లీ నుండి ఎపి,తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా వివిధ పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించారు.ఈసమావేశం లో ప్రధానంగా ఎపి,తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 10 ద్వైపాక్షిక అంశాలు మరియు 8 ప్రాజెక్టులు,ఇతర అజెండా అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఎపి,తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ,సోమేశ్ కుమార్ లతో సమీక్షించారు.ముఖ్యంగా షెడ్యూల్ 9,10లలో పేర్కొన్న సంస్థలలకు సంబంధించిన వివాదాలు,ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్,సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరియు దాని సబ్సిడరీ కంపెనీ అయిన ఆంధ్రప్రదేశ్ హెవీ మెచినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ భవన్,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 50,51 మరియు 56లో పేర్కొన్న విధంగా పన్ను బకాయిలు,పన్ను రీఫండ్ అంశాలపైన సమీక్షించారు. అదే విధంగా పునర్విభజన చట్టంలో ఎక్కడా లిస్ట్ కాబడని ఇనిస్టిట్యూషన్ల ఎపాయింట్మెంట్, డివిజన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సు మరియు బ్యాంకు డిపాజిట్లు,తెలంగాణా డిస్కం ఎపి జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇరువురు సిఎస్ లతో సమీక్షించారు.ఈసందర్భంగా అజయ్ భల్లా మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను సామరస్య పూర్వకంగా పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందింస్తుందని పేర్కొన్నారు.

ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించి 2014-15 ఏడాదికి సంబంధించిన రిసోర్సు గ్యాప్ ఫండింగ్ నిధులు సమకూర్చాల్సిన అవసరంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా  దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు,ఎపిలో గ్రీన్ ఫీల్డు క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వివరించారు.అలాగే కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన చర్యలు,విశాఖపట్నం,విజయవాడ,తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలుగా తీర్చి దిద్దాల్సిన ఆవశ్యకత అంశాలను వివరించారు.దుగ్గరాజు పట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి,విశాఖపట్నం-చైన్నైపారిశ్రామిక నడవా,కేంద్రం నుండి రావాల్సిన పన్ను రాయితీలు తదితర అంశాలను సిఎస్ డా.సమీర్ శర్మ హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృష్టికి తెచ్చారు.

ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్,ఎస్ఆర్సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి,ఎపి జెన్ కో ఎండి శ్రీధర్,వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా,ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,సివిల్ సప్లయిస్ కమీషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొనగా ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్,వీడియో లింక్ ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పాల్గొన్నారు.