- సీఎం జగన్ ను విమర్శిస్తే మంత్రి కొడాలి నాని చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండదు
- కొడాలిని అల్లరి చేయాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు
- గుడివాడ మున్సిపల్ మాజీ వైనైచైర్మన్ అడపా బాబ్జి
గుడివాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): సీఎం జగన్మోహనరెడ్డిని విమర్శిస్తే రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని, మంత్రి కొడాలి నానిని అల్లరి చేయాలనుకుంటే గుడివాడ నియోజకవర్గ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి హెచ్చరించారు. మంగళవారం గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంపై గత వారం రోజులుగా టీడీపీ, దాని తోక పార్టీలు దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కొద్ది రోజుల కిందట గుడివాడ పట్టణానికి వచ్చి నానా యాగీ చేసి అవమానాలు, ప్రజల చీత్కారాలకు గురయ్యారన్నారు. టీడీపీకి తోక పార్టీగా ఉన్న బీజేపీకి అధ్యక్షుడు సోము వీర్రాజు గుడివాడ వచ్చి సంక్రాంతి సంబరాలు అంటే గుడివాడ ప్రజలకు వివరిస్తానని అంటున్నాడన్నారు. సోము వీర్రాజు చెబితేనే గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంబరాల గురించి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలయం గుడివాడ నియోజకవర్గమని అన్నారు. గత ఐదేళ్ళుగా మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్ని ఆధ్వర్యంలో గుడివాడలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు పోటీలను నిర్వహిస్తూ పశు పోషకులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుండి లక్ష మందికి పైగా పశు పోషకులు, రైతులు, ప్రజలు విచ్చేసి ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు జరిగాయని, ఈసారి టీడీపీ, తోక పార్టీలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు. ఏమీ జరగకపోయినా చీర్ గర్ల్స్ వచ్చారని ఇప్పుడు చీర్ బాయ్స్ వస్తున్నారన్నారు. పేరుకు సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడని, టీడీపీకి బీ బ్యాచ్ గా పనిచేస్తున్నాడన్నారు. కర్నూలులో టీజీ వెంకటేష్, కడపలో సీఎం రమేష్, కృష్ణాజిల్లాలో సుజనాచౌదరిలు టీడీపీ ఏజెంట్లుగా బీజేపీలో పనిచేస్తున్నారని, వీరు ఏ సమావేశాలకు రమ్మంటే వాటికి సోము వీర్రాజు హాజరవుతున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏం జరిగిందని సోము వీర్రాజు యాగీ చేస్తున్నాడని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని పేరు చెబితే గుడివాడ నియోజకవర్గం గుర్తుకు వస్తుందని, అటువంటి నియోజకవర్గంలో ఎవరూ రెండుసార్లు మించి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదన్నారు. మంత్రి కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారని, ఆయన వద్దనుకునే వరకు గెలుస్తూనే ఉంటారన్నారు. మంత్రి కొడాలి నానిని ఓడించే దమ్ము, సత్తా ఉన్న నాయకుడు లేడని చెప్పారు. గుడివాడ నియోజకవర్గాన్ని అల్లరి చేస్తున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా తిప్పికొడతామన్నారు. మంత్రి కొడాలి నానిని ఏదో చేస్తానని బుద్ధా వెంకన్న ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే గుడివాడ వచ్చి కే కన్వెన్షన్ గేటును తాకి తిరిగి వెళ్ళగలరా అని అన్నారు. మంత్రి కొడాలి నానిపై దుష్ప్రచారాన్ని ఆపకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంత్రి కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కోవాలని, అలా కాకుండా అల్లరి చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచన నుండి బయటకు రావాలన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు మంత్రి కొడాలి నాని వెన్నంటే ఉంటారని, గత 30 ఏళ్ళుగా నియోజకవర్గంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. మంత్రి కొడాలి నాని సంస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అడపా బాబ్జి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, లోయ రాజేష్, తోట నాగరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, వెంపటి సైమన్, చింతల భాస్కరరావు, కొంకితల ఆంజనేయప్రసాద్, రేమల్లి పసి, మేకల సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment