ఎడ్ల ప్రదర్శనను క్యాసినోగా గ్రాఫిక్స్ చేశారు

 


- నిజ నిర్ధారణ కమిటీపై ప్రజలు తిరగబడి తగిన రీతిలో బుద్ధి చెప్పారు 

- ఎడ్ల ప్రదర్శనను క్యాసినోగా గ్రాఫిక్స్ చేశారు 


- కే కన్వెన్షన్లో రైతులకు భోజన, వసతి ఏర్పాట్లు 

- పోటీలను వీక్షించేందుకు వచ్చిన వారంతా చూశారు 

- వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి 



గుడివాడ, జనవరి 22 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశ్యంతో గుడివాడ వచ్చిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై నియోజకవర్గ ప్రజలు తిరగబడి తగిన రీతిలో బుద్ధి చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు అన్నారు. శనివారం గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ లేనట్టుగా విజయవాడ నుండి తోపులు వచ్చారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా కే కన్వెన్షన్లో ఏం జరిగిందో ఇక్కడి టీడీపీ నాయకులకు తెలియడం వల్లే నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో కలవలేదన్నారు. చంద్రబాబు, లోకేష్, డబ్బా ఛానల్స్ వచ్చి గుడివాడలో క్యాసినో జరిగినట్టుగా నిజ నిర్ధారణ చేసి నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తామన్నారు. అలా కాకుండా ఎడ్ల పోటీలను క్యాసినోగా చిత్రీకరించి గ్రాఫిక్స్ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి గుడివాడలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు మాత్రం అభూత కల్పనలను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. కే కన్వెన్షన్లో పశు పోషకులు, రైతులు, ప్రజలకు ఐదు రోజుల పాటు భోజన వసతి ఏర్పాట్లు చేశామని, ఈ విషయం గుడివాడ ప్రజలందరికీ తెలుసని అన్నారు. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం తమకు ఉందని, టీడీపీ నాయకులు దుష్ప్రచారాలను కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మండలి హెచ్చరించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ గుడివాడలో క్యాసినో జరిగిందంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల విచారణ జరుగుతోందన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే పోలీసులు దృష్టికి తీసుకురావచ్చని, అలా కాకుండా నిజ నిర్ధారణ కమిటీ వేయడం ఏంటని తప్పుపట్టారు. టీడీపీ హయాంలో కైకలూరులో మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్ లు  వేయించిన సంఘటనపై నిజ నిర్ధారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. బొండా ఉమా ఎన్ని అరాచకాలు చేసినా టీడీపీ అధికారంలో ఉండడం వల్లే తప్పించుకున్నాడన్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వేసిన కమిటీగా అభిప్రాయపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ దుష్ట పన్నాగాలు పనిచేయవని గొర్ల శ్రీను హెచ్చరించారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి మాట్లాడుతూ గుడివాడలో గొడవలను సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని, వైసీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాయన్నారు. ఎడ్ల పందాలు జరిగాయని, క్యాసినో జరిగినట్టుగా నిరూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఆదేశాలతో వైసీపీ శ్రేణులు ఎంతో ఓర్పుతో వ్యవహరించాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎవరికీ భయపడలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని సర్దార్ బేగ్ చెప్పారు. వైసీపీ నేత అల్లం రామ్మోహన్ మాట్లాడుతూ మంత్రి కొడాలి నానిపై ఎన్ని కుట్రలు చేసినా వాటిని సమర్ధవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, నాయకులు తోట రాజేష్, చుండూరు శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, ఎస్కే బాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments