దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని

 దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని


- రూ.1.70 కోట్లతో భీమేశ్వరాలయం అభివృద్ధికి చర్యలు

- పనులను పర్యవేక్షించేందుకు అభివృద్ధి కమిటీ ఏర్పాటు

- వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్



గుడివాడ, జనవరి 26 (ప్రజా అమరావతి): గుడివాడ పట్టణంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. బుధవారం మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయంలో దుక్కిపాటి శశిభూషణ్ మీడియాతో మాట్లాడారు. గుడివాడలో ప్రసిద్ధి చెందిన శ్రీగంగా పార్వతీ సమేత శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గతంలో మంత్రి కొడాలి నాని ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులతో సమావేశమయ్యారని తెలిపారు. దేవాదాయశాఖ అధికారులతో కూడా చర్చించారని చెప్పారు. దేవస్థానంలో ఫ్లోరింగ్, బేడా మండపం, అర్చక క్వార్టర్స్, గోశాల, యాగశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్ణయించారన్నారు. ప్రభుత్వం నుండి రూ. 1.53 కోట్ల సీజిఎఫ్ నిధులను మంజూరు చేయించారని తెలిపారు. రూ.17 లక్షల భాగస్వామ్యాన్ని కూడా కలిపి ఆయా అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు భక్తిభావం కల్గిన వారు, సీనియర్లతో ఆలయ అభివృద్ధి కమిటీని నియమించినట్టు తెలిపారు. కమిటీ చైర్మన్ గా చందరాల హరిరాంబాబు, సభ్యులుగా జోగా సూర్యప్రకాశరావు, తోట ప్రసాద్, తోట శివాజి, రాజనాల శ్రీనివాస్, పీఎల్వీ సుబ్రహ్మణ్యం, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, జ్యోతుల శ్రీనివాసరావులను నియమించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా బుధవారం దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులతో తొలి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులు పీఎల్వీ సుబ్రహ్మణ్యం, రాజనాల శ్రీనివాస్ లు రూ. లక్ష చొప్పున విరాళాన్ని అందించారన్నారు. మరో సభ్యుడు జోగా సూర్యప్రకాశరావు రూ.25 వేల విరాళాన్ని అందజేశారన్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులను దేవాదాయశాఖ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments