క్రీడా మౌలిక సదుపాయాలభివృద్ధికి 185కోట్లతో 138 పనులు మంజూరు
• 18 రాష్ట్ర క్రీడా సంఘాలకు 2కోట్ల 97లక్షల రూ.ల ఆర్ధిక సహాయం
• గ్రామ పంచాయితీకి ఒక ప్లేఫీల్డు ఏర్పాటు ఇప్పటికే 2వేల 325 పూర్తి
• ఎస్సి కాంపొనెంట్ కింద రెసిడెన్సియల్ పాఠశాలల్లో స్టేడియంలు,ప్లే ఫీల్డులు
• సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆరు విభాగాల్లో క్రీడా పాఠశాలలు
• ప్రతిభల క్రీడాకారుల ప్రోత్సాహకానికి జిల్లాల వారీగా సియం కప్ క్రీడాపోటీలు
• కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పిపిపి విధానంలో క్రీడా మౌలిక సదుపాయాలభివృద్ధి
రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,క్రీడల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అమరావతి,16 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కింద స్టేడియం, టెన్నిస్ కోర్టులు,స్విమ్మింగ్ పూల్స్,ప్రాంతీయ అకాడమీలు,వాటర్ స్పోర్స్టు అకాడమీలు,చెక్క ప్లోరింగ్ వంటి వాటి నిర్మాణానికై రాష్ట్ర స్పోర్ట్సు అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్)ద్వారా 185కోట్ల 34 లక్షల రూ.ల అంచనా వ్యయంతో 138 పనులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,క్రీడల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) వెల్లడించారు.బుధవారం అమరావతి సచివాలయం 3వ బ్లాకులోని మంత్రివర్యుల చాంబరులో క్రీడలు,పర్యాటక తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులందరినీ ప్రోత్సహించేందుకు జిల్లాల వారీగా సియం కప్ క్రీడాపోటీలను నిర్వహింస్తుండగా ఇప్పటికే మూడు జిల్లాల్లో వీటిని పూర్తి చేశామని చెప్పారు.ఈనెల 24న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోను,25కృష్ణా జిల్లా మచిలీపట్నం లోను సియం కప్ క్రీడాపోటీలను నిర్విహించనున్నట్టు తెలిపారు.మండల,నియోజకవర్గ,జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో ఎపి సియం కప్ క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రంలోని 18 క్రీడా సంఘాలకు శాప్ ద్వారా 2కోట్ల 97లక్షల 52వేల రూ.ల ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.అంతేగాక ఖేలో ఇండియా పధకం కింద విజయనగరం,నెల్లూరు,కాకినాడ,రాజమహేంద్రవరం,తిరుపతి నగరాల్లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద స్టేడియంల నిర్మాణానికి భారత ప్రభుత్వం 32కోట్ల 30లక్షల రూ.ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు.అలాగే ఖేలో ఇండియా మౌలిక సదుపాయాల పధకం కింద శాప్ ద్వారా 4 కొత్త ప్రాజెక్టులను అనగా కర్నూల్ జిల్లాలో పుట్ బాల్ మైదానం,వైయస్సార్ కడప జిల్లా మరియు నెల్లూరు జిల్లాల్లో అధ్లెటిక్ ట్రాక్స్, విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.జిల్లాకు ఒక జిల్లాస్థాయి ఖేలో ఇండియా కేంద్రాల ఏర్పాటుకు శాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపామని మంత్రి శ్రీనివాస్ వివరించారు.
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ప్లే ఫీల్డు అందుబాటులో ఉండేలా 2వేల 444 ప్లే ఫీల్డులను మంజూరు చేయగా ఇప్పటికే 2325 పూర్తికాగా అదనంగా మరో 4వేల 555 మంజూరు చేశామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.అదే విధంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించి 106 క్రీడా వికాస కేంద్రాలను(కెవికె)మంజూరు చేయగా ఇప్పటికే 38 పూర్తికాగా మరో 68 ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పబ్లిక్ ప్రవేట్ భాగస్వామ్యం (పిపిపి)కింద కూడా క్రీడాపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆరు క్రీడా విభాగాల్లో అనగా అధ్లెటిక్స్,ఆర్చరీ,బాక్సింగ్,ఫెన్సింగ్,షూటింగ్,వెయిట్ లిప్టింగ్ అంశాల్లో పశ్చిమగోదావరి జిల్లా బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పెదవేగిలో బాలురకు,పోలసానిపల్లిలో బాలికలకు వేరువేరుగా క్రీడా పాఠశాలలను ప్రారంభించామని మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు.
వైయస్సార్ అర్కీడా ప్రోత్సాహకాలు కింద 55 క్రీడా విభాగాల్లో 1471 మంది క్రీడాకారులకు 4కోట్ల 58లక్షల 40వేల రూ.లను శాప్ ద్వారా నగదు ప్రోత్సాహకాలుగా అందించడం జరిగిందని మంత్రి శ్రీనివాసరావు వివరించారు.అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన 76మంది అంతర్జాతీయ పతక విజేతలకు 8కోట్ల 62లక్షల 52వేల రూ.ల నగదు ప్రోత్సాహకాల కింద మంజూరు చేశామని తెలిపారు.కడప వైయస్సార్ స్పోర్ట్సు స్కూల్,వాటర్ స్పోర్ట్సు అకాడమీ కృష్ణా జిల్లా(పున్నమిఘాట్),పశ్చిమ గోదావరి జిల్లా (ఎర్రకాలువ)లకు రెగ్యులర్ కోచింగ్ కార్యకలాపాలకు 8కోట్ల రూ.ల విలువైన క్రీడా పరికరాలను శాప్ ద్వారా అందించినట్టు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించినందుకు బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్షల రూ.లు పోత్సాహకాన్ని అందించడంతో పాటు విశాఖపట్నంలో బాడ్మింటన్ అకాడమీ మరియు స్పోర్ట్సు స్కూల్ ఏర్పాటుకు 2ఎకరాల స్థలం మంజూరు చేశారని మంత్రి చెప్పారు.అలాగే టోక్యో ఒలింపిక్స్ లో హాకీ క్రీడాకారిణి ఈ.రజిని 4వ స్థానంలో నిలిచినందుకు గత విజయాలకు గాను 92లక్షల 50వేల రూ.ల నగదు ప్రోత్సాహకాన్ని అందించడం జరిగిందన్నారు.బాడ్మింటన్ క్రీడాకారుడు కె.శ్రీకాంత్ బిడబ్లుఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్పు-2021లో కాంస్య పతకం సాధించినందుకు 7లక్షల రూ.ల నగదు ప్రోత్సాహకాన్ని అందించడంతోపాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు 5ఎకరాల భూమిని మంజూరు చేశామని తెలిపారు.ఆర్చెరీ క్రీడాకారిణి వి.జ్యోతి సురేఖ 16 అంతర్జాతీయ పతకాలను సాధించినందుకు 65 లక్షల రూ.ల నగదు ప్రోత్సాహకాన్ని మంజూరు చేసినట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
అనంతరం పర్యాటక,సాంస్కృతిక,క్రీడల విభాగాలకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు.ఈసమీక్షా సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక,క్రీడలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్,శాప్ ఒఎస్డి రామకృష్ణ,ఎడి యువజన సర్వీసులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment