776 అభ్యంతరాలు, సూచనలను స్వీకరించాం.
రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ కి వివరించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి.
అనంతపురం, ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి) :
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనంతపురం జిల్లాలో 776 అభ్యంతరాలు, సూచనలను స్వీకరించడం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ కి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వివరించారు.
శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కడప జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్, తదితరులతో రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ సమావేశం నిర్వహించారు. ఇందులో అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 776 అభ్యంతరాలు, సూచనలను స్వీకరించడం జరిగిందని, ఇందులో హిందూపురం, పెనుకొండ ప్రాంతాలలో జిల్లా కేంద్రంగా చేయాలని 443 వినతులు అందజేశారన్నారు. అలాగే ధర్మవరం రెవెన్యూ డివిజన్ ని కొనసాగించాలని 320 వినతులు, రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని మూడు వినతులు, అనంతపురం జిల్లా పేరును ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, డా. నీలం సంజీవరెడ్డి పేరుగా మార్చాలని 5 వినతులు, నూతన రెవెన్యూ డివిజన్గా మడకశిర ఏర్పాటు చేయాలని మూడు వినతులు, గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఒకటి చొప్పున రెండు వినతులు అందజేసినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రొఫైల్ ని, జియోగ్రాఫికల్ ఏరియాని, రెవెన్యూ డివిజన్స్ వివరాలను, పాపులేషన్, ఇరిగేషన్ వివరాలను, రోడ్లు, పరిశ్రమల వివరాలను వివరించారు. అనంతపురం జిల్లా 34 మండలాలతో, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు రెవెన్యూ డివిజన్ లతో ఏర్పడనున్నట్లు తెలిపారు. అలాగే పుట్టపర్తి జిల్లా 29 మండలాలతో, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి రెవెన్యూ డివిజన్ లతో ఏర్పడనున్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే శ్రీ సత్య సాయి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం, జిల్లా ఎస్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశీలించిన భవనాల వివరాలు, స్థలం వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
చిత్తూరు జిల్లా పునర్నిర్మాణం మరియు ఏర్పాటును వివరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ :*
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ చిత్తూరు జిల్లా పునర్నిర్మాణం మరియు ఏర్పాటు వివరాలను వివరించారు. జిల్లా ప్రొఫైల్, వర్షపాతం, వ్యవసాయ విస్తీర్ణం, ఇరిగేషన్, వెటర్నరీ, తాగునీటి వివరాలు, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ తదితర అన్ని రకాల వివరాలు వివరించారు. చిత్తూరు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ లో ఉన్నట్లు, 66 మండలాలు ఉన్నట్లు, మూడు పార్లమెంట్ స్థానాలు, 2 మున్సిపల్ కార్పొరేషన్ లు, ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాని చిత్తూరు జిల్లా, శ్రీ బాలాజీ జిల్లా, అన్నమయ్య జిల్లాగా పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జనవరి 26 వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు 148 సూచనలు, అభ్యంతరాలను స్వీకరించడం జరిగిందన్నారు. ఇందులో నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని 103 వినతులు రావడం జరిగిందని, వెదురుకుప్పం మండలాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని 6 వినతులు, మదనపల్లి ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక వినతి, శ్రీకాళహస్తిని కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని 4 వినతులు వచ్చినట్లు తెలిపారు. పేద రాజకీయ పార్టీల నుంచి 23, ప్రజల నుంచి 90 వినతులు, డివిజన్ వారీగా 114 వినతులు వచ్చాయని తెలిపారు.
28 మండలాలతో కర్నూలు జిల్లా, 27 మండలాలతో నంద్యాల జిల్లా ఏర్పాటు : కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కర్నూలు జిల్లాని కర్నూలు, నంద్యాల రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు వివరించారు. కర్నూలు, నంద్యాల జనాభా, ప్రభుత్వ భవనాల వివరాలు, వచ్చిన అభ్యంతరాలు, సూచనలు వివరాలు తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ఆదోని డివిజన్ ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, నందికొట్కూరుని కర్నూలు డివిజన్ లో కలపాలని, కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలని వినతులు వచ్చినట్లు తెలిపారు. అలాగే కర్నూలును కందనోవోలు చేయాలని, డోన్ మండలాన్ని కర్నూల్ లో కలపాలని, రాయలసీమను 10 - 11 జిల్లాలుగా చేయాలని, కొత్త జిల్లాల ఏర్పాటు ను రవాణాకు అనుకూలంగా చేయాలని వినతులు వచ్చినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలో ఉంచమని వినతులు వచ్చినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా 28 మండలాలతో, కర్నూలు రెవెన్యూ డివిజన్ లో 11 మండలాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆదోని రెవెన్యూ డివిజన్లో 17 మండలాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో 27 మండలాలతో ఏర్పాటు చేయనున్నట్లు, అందులో నంద్యాల రెవెన్యూ డివిజన్ లో 9 మండలాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, డోన్ రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లో 10 మండలాలు 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో గుర్తించిన వివిధ ప్రభుత్వ భవనాల వివరాలు, నూనెపల్లె లోని ఆర్ఏఆర్ఎస్ భవనం, వైఎస్సార్ సెంట్రల్ హాల్, విక్టోరియా రీడింగ్ రూమ్ తదితర భవనాల వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కడప జిల్లాలో 811 వినతులు : కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి.
ఈ సందర్భంగా కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కడప జిల్లాలో 811 వినతులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో నూతనంగా ఏర్పాటు చేసే జిల్లా కేంద్రాన్ని మార్చాలని, రాజంపేటని జిల్లా కేంద్రంగా చేయాలని 795 వినతులు వచ్చినట్లు తెలిపారు. డివిజన్ కేంద్రాన్ని మార్చాలని 7 వినతులు, కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఒక వినతి, కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మూడు వినతులు, ఇతరం 5 వినతులు, కొత్త మండలం ఏర్పాటు చేయాలని ఒక వినతి వచ్చినట్లు తెలిపారు. రాయచోటిలో కలెక్టరేట్ ఇతర కార్యాలయాల కోసం మూడు ప్రభుత్వ భవనాలను గుర్తించామన్నారు. కడప జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్ లు, 51 మండలాల వివరాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు ఉన్నట్లు తెలిపారు. కడప జిల్లాకు సంబంధించి ఇతర వివరాలు వివరించారు.
addComments
Post a Comment