ఇది నా ఊరు నా బాధ్యత

 గుంటూరు , 12 మే 2025 (ప్రజా అమరావతి):



  పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.  

  సోమవారం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రంలోని శ్రీ జనార్ధన స్వామి వారి దేవస్థానం ( చిన్న దేవుని గుడి) సమీపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ , జిల్లా  ఇన్ చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా పాల్గొని ప్రజల నుండి  200 ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ , నూతన రైస్ కార్డుల కొరకు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో అందాయన్నారు. అర్జీలు స్వీకరించిన అనంతరం  రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 9 వేల 600 మందికి రూ.40 కోట్లు రూపాయలు ఎన్ టీ ఆర్ పెన్షన్ క్రింద అందజేస్తున్నట్లు తెలిపారు.  అలాగే క్రొత్తగా ఒక కోటి 46 లక్షల మందికి  రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. అర్హత కలిగిన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొల్లిపర మండలంలో రైతులకు సంబంధించి డొంక రోడ్లు అభివృద్ధి కోసం రూ.10 కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో మొట్ట మొదటగా కొల్లిపర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో రూ 12వేల కోట్ల నగదును జమ చేసినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా దావులూరు అడ్డరోడ్డు నుంచి కొల్లిపర వరకు రోడ్డును విస్తరణ చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటానికి ఇప్పటికే ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు అక్రమణకు గురైతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. పారిశుధ్యం విషయంలో ప్రతి గ్రామంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు రక్షిత మంచినీటి పథకానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గ్రామాల్లో దొంగతనాలు పెరిగి పోవడం వలన పోలీసు శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దొంగతనాలు ఆరికట్టడానికి పోలీసు శాఖ ద్వారా గట్టి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువత గంజాయికి అలవాటుబడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. నెల రోజుల లోపులో గంజాయిని ఆరికట్టనున్నట్లు తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 

  జిల్లా  ఇన్ చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ కొల్లిపర గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ కొల్లిపరలో జిల్లా , డివిజనల్ స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  ప్రతి సోమవారం మండల, డివిజన్ , జిల్లా స్థాయిలతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని , కాని ఈ రోజు మీ సమస్యల పరిష్కారానికి మీ వద్ద  పీజీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  అత్యంత ప్రాధాన్యతతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. 

  తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను మండల , డివిజన్,జిల్లా స్థాయిలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి  ఒక నిర్ణీత గడువు ఏర్పాటు చేసుకుని ఆ గడువు లోపల పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎక్కువగా  మ్యూటేషన్ , రీ సర్వే , రెవెన్యూ అంశాలకు సంబంధించిన అందిన అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించే విధంగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

  ఈ కార్యక్రమంలో డిపిఓ నాగసాయి కుమార్, డిఇఓ సివి రేణుక, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వేకంటేశ్వర్లు, తెనాలి  వ్యవసాయ శాఖ ఏడి ఉషారాణి , తెనాలి డిఎస్పీ జనార్ధన రావు,  కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, తహసీల్దార్ సిద్ధార్థ , ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీవో విజయలక్ష్మి , వెటర్నరీ అధికారి సాయి సతీష్ రాజు , వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. భరత్ ,   ఎలక్ట్రికల్ ఏఈ ప్రదీప్ కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వంగా సాంబి రెడ్డి , బీసీ నాయకులు అద్దంకి వేణుగోపాల్ గౌడ్ , జనసేన నాయకులు కట్టా. శ్రీధర్ రెడ్డి, ఆళ్ల. వీరారెడ్డి, భీమవరపు. కోటిరెడ్డి (ఎన్టీఆర్), అడపా నారాయణ రెడ్డి , భీమవరపు కిషోర్ రెడ్డి , మండల , జిల్లాకు సంబందించిన వివిధ శాఖాధికారులు  పాల్గొన్నారు.   

Comments