రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని

 నెల్లూరు,(prajaamaravati);


రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని


,  రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యమైన దిగిబడి సాధించేలా  వ్యవసాయ శాఖ అధికారులు,  వ్యవసాయ శాస్త్రవేత్తలు  కృషి చేయాలని జిల్లా కలెక్టర్  శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.


బుధవారం  నెల్లూరు నగరంలోని  వ్యవసాయ పరిశోధనా స్థానము నందు ఏర్పాటు చేసిన కిసాన్ మేళా ను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  సూళ్ళూరుపేట శాసన సభ్యులు మరియు ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గ సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య తో కలసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  రైతు సదస్సులో  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని  ప్రతి రైతుకు ఆ గ్రామంలోనే  అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు,  నాణ్యమైన విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు  అందచేసేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అనేది దేశంలో ఏ రాష్ట్రంలో లేదని కలెక్టర్ అన్నారు.  ప్రతి సీజన్ లో రైతులకు  లాభం రావాలన్న సంకల్పంతో  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకుని  ఎక్కువ దిగుబడులు సాధించి తద్వారా ఆర్ధికంగా అభివృద్ది చెందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో  668 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి  రైతులకు మరింత మెరుగైన సేవలు  అందేలా వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు అదే సీజన్లో  నష్ట పరిహారం అందేలా  గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు తెలిపారు.  65 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరిలో ఎక్కువమంది రైతులు వరి పంట సాగుచేస్తున్నారని,  రైతులు  ప్రత్యామ్నాయ పంటలవైపు మారాల్సిన అవసరం వుందని కలెక్టర్ అన్నారు.  తమ పరిశోధనల వలన  క్షేత్ర స్థాయిలో  రైతుల ఆదాయం పెరిగేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 


సూళ్ళూరుపేట శాసన సభ్యులు మరియు ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గ సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ,  రైతు ఏ స్థాయిలోనూ  నష్ట పోకుండా, పెట్టిన పెట్టుబడికి లాభం రావాలన్న లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి  రైతులకు అవసరమైన అన్నీ సేవలను  రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు శ్రీ సంజీవయ్య తెలిపారు.    ప్రతి రైతు వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో చేసుకోవాలన్న లక్ష్యంతో రైతు పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి  వ్యవసాయ రంగం అభివృద్దికి హర్నిశలు కృషి చేస్తున్నారని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని తక్కువ ఖర్ఛుతో ఎక్కువ దిగుబడి వచ్చే  28 రకాల వరి విత్తనాలను ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం  పరిధిలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ది చేయడం జరిగిందని ఈ సంధర్భంగా ఆయన గుర్తు చేశారు. 


జాయింట్ కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ,   రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని  రైతు భరోసా కేంద్రం స్థాయిలోనే  కష్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి  40 శాతం సబ్సిడీతో  వ్యవసాయ ఉపకరణాలు  అందించడం జరుగుచున్నదని, రైతులు  ముందుకు వచ్చి  రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సీజన్ లో  జిల్లాలో పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర  లభించేలా  ఈ సంవత్సరం మిల్లర్లతో ప్రమేయం లేకుండా నేరుగా  ఆర్.బి.కె.ల నుండే ధాన్యాన్ని సేకరించేలా  ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని  జాయింట్ కలెక్టర్ తెలిపారు. 


ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గ సభ్యులు మరియు  రిటైర్డ్ (ప్రత్తి) ప్రధాన శాస్త్రవేత్త డా. వి. చెంగా రెడ్డి,  గుంటూరు ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా. పి. రాంబాబు,  పరిశోధనా సంచాలకులు డా. ఎల్. ప్రశాంతి,  తిరుపతి  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పరిశోధనా సహ సంచాలకులు డా. పి. రాజశేఖర్, రైతు నాయకులు శ్రీ కోటి రెడ్డి  తదితరులు  ప్రసంగిస్తూ,   రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు   రైతులు తక్కువ ఖర్ఛుతో ఎక్కువ దిగుబడి సాధించేలా   చేపడుతున్న కార్యక్రమాలను, పరిశోధనలను  గురించి వివరించారు.


అనంతరం  రైతులకు ఉపయోగపడేలా వివిధ పంటల యాజ్యమన్య పద్ధతులపై రూపొందించిన కరపత్రాలను, బ్రోచర్లను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  సూళ్ళూరుపేట శాసన సభ్యులు మరియు ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గ సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య తో కలసి ఆవిష్కరించారు. 


తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,  నెల్లూరు  వ్యవసాయ పరిశోధనా స్థానములో ఏర్పాటు చేసిన  క్షేత్ర సందర్శన మరియు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే  ఎరువులు, పురుగు మందులు, యంత్రాలతో  వివిధ కంపెనీల వారు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను  తిలకించారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి  వై. ఆనందకుమారి,  నెల్లూరు  వ్యవసాయ పరిశోధనా స్థానము సీనియర్  శాస్త్రవేత్త డా. యు.వినీత,  సిబ్బంది,  రైతులు, వ్యవసాయ మరియు మత్స్య శాఖ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Comments