గోసంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై పెద్ద ఎత్తున ప్రచారం

 గోసంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై పెద్ద ఎత్తున ప్రచారం

– నోడల్ గోశాలల నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు

– టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 19 ఫిబ్రవరి  (ప్రజా అమరావతి): గో సంరక్షణ, గోశాలల నిర్వహణతో పాటు గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నోడల్ గోశాలల నిర్వాహకులకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తామని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు రెండు చొప్పున ఎంపిక చేసిన నోడల్ గోశాలల నిర్వాహకులతో శనివారం ఈవో దృశ్య, శ్రవణ (వర్చువల్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు తమ సమస్యలు, గో ఆధారిత వ్యవసాయం లోని ఇబ్బందులు, మార్కెటింగ్, ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలను ఈవో దృష్టికి తీసుకువచ్చారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ, గోసంరక్షణ, గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ ఇప్పటికే అందిస్తున్న సహకారం, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.రాష్ట్రంలోని గోశాల లను స్వయం సంవృధ్ధి గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాలిచ్చే ఆవుల సంఖ్యను పెంచుకోవడం, పాలివ్వని గోవులను గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు అందించడం లాంటి ఏర్పాట్లు జరగాలన్నారు. ఇందులోభాగంగా టీటీడీ గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు 1300 గోవులు, ఎద్దులు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ తో ఒప్పందం చేసుకుని, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తిరుమలలో శ్రీవారి ప్రసాదాల తయారీకి సేకరిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో అన్నదానం కు అవసరమైన బియ్యం, బెల్లం, సెనగలు లాంటి ఉత్పత్తులు కూడా సేకరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించి రాష్ట్రంలోని పెద్ద దేవాలయాలన్నీ గో ఆధారిత ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చూస్తామని గో శాలల నిర్వాహకులకు ఆయన చెప్పారు.ప్రతి గ్రామంలో గో సంచార భూమి (మేత భూమి) ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోతానన్నారు. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్న సందర్భంలో టీటీడీ నుంచి గోవులకు దాణా, గడ్డి అందించే విజ్ఞప్తిని పరిశీలిస్తామని డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు. గోశాలలకు పశువైద్య విశ్వవిద్యాలయం , మరియు పశుసంవర్ధక శాఖ నుంచి సాంకేతిక సహకారం అందించేలా చూస్తామన్నారు.ఘన, ద్రవ జీవామృతం, పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసే విధానం, వాటివల్ల పర్యావరణానికి, సమాజానికి జరిగే ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇస్కాన్ సంస్థ సహకారంతో గోశాలల నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామని ఈవో తెలిపారు. పంచగవ్య తయారీ, మార్కెటింగ్ లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న సంస్థలు, నిపుణులను పిలిపించి రైతులకు, గోశాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన నోడల్ గోశాలల ఇందులో కీలకంగా పని చేయాలని సూచించారు. యజ్ఞాలు, హోమాలు, దహన సంస్కారాలు, ఇతర కార్యక్రమాలకు ఆవు పేడ తో తయారు చేసిన పిడకలు, దుంగల వాడకం వల్ల వాతావరణ కాలుష్యం ఏ విధంగా తగ్గించవచ్చో కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, ఇస్కాన్ తిరుపతి శాఖ అధ్యక్ష్యులు శ్రీ రేవతి రమణ దాస్, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విజయరాం, నెల్లూరు కు చెందిన ఆయర్వేద వైద్యులు డాక్టర్ శశిధర్ తో పాటు రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments