శ్రీ సత్య సాయి జిల్లాలో తాత్కాలిక ప్రభుత్వ భవనాల కోసం స్థల సేకరణ చేపట్టాం

 *శ్రీ సత్య సాయి జిల్లాలో తాత్కాలిక ప్రభుత్వ భవనాల కోసం స్థల సేకరణ చేపట్టాం*


*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*


పుట్టపర్తి (అనంతపురం), ఫిబ్రవరి 16 (ప్రజా అమరావతి):


నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సత్యసాయి జిల్లాలో తాత్కాలిక ప్రభుత్వ భవనాల ఏర్పాటు కోసం పుట్టపర్తి పట్టణంలో పలు భవనాలను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో బుధవారం పుట్టపర్తి పట్టణంలోని పర్తి ధర్మశాలను, బాబా లెర్నింగ్ సెంటర్ ని, శ్రీ సత్య సాయి హాస్పిటల్ తదితర భవనాలను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కేతన్ గార్గ్, ఆర్డీఓ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పరిశీలించారు.


ఈ సందర్భంగా బాబా లెర్నింగ్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సత్యసాయి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం కోసం, 100 ప్రభుత్వ శాఖలకు సంబంధించి తాత్కాలిక భవనాల కోసం పుట్టపర్తిలో పలు భవనాలను పరిశీలించడం జరిగిందన్నారు. తాత్కాలిక భవనాల కోసం పలు ప్రైవేటు భవనాలు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కు సంబంధించిన భవనాలను పరిశీలించామన్నారు. ట్రస్ట్ వారితో, ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం కోసం, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి భవనాలను ఫైనల్ చేసుకొని అవసరమైన చోట మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాత్కాలిక భవనాల కోసం ఎంపిక చేసిన భవనాలను రికార్డ్ రూములు, విసి హాల్స్ తదితర రిక్వైర్మెంట్స్ కు అనుగుణంగా ఆర్అండ్బి శాఖ ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం అవసరమైన పనులు చేపట్టి కొత్త జిల్లాకు ప్రభుత్వ శాఖలు షిఫ్ట్ అయ్యేలా చూసేందుకు ఈరోజు భవనాలను పరిశీలించడం జరిగిందన్నారు.


ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా ఏప్రిల్ 2వ తేదీ నుంచి పనిచేయడం మొదలవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఇతర సిబ్బందితో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ చేసి కొత్త జిల్లాలు ఏర్పాటును పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది కొత్త సంవత్సరం నుంచి ఇక్కడ పరిపాలన ప్రారంభమవుతుందని తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ పుట్టపర్తి పట్టణంలో మౌలిక సదుపాయాలు, తాత్కాలిక భవనాల ఏర్పాటు కోసం అన్ని భవనాలను గుర్తించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చాలా పెద్దదని, అవసరమైన ఎస్పీ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, డిఆర్ తదితర వాటి కోసం ఇంకా తాత్కాలిక భవనాలను ఫైనల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు కూడా చాలా సహకరిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా సహకారం అందిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో భవనాలను ఫైనలైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఇప్పటికే పోలీసు సబ్ డివిజన్ ఉందని, మరికొన్ని పోలీస్ స్టేషన్ లను యాడ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి కేశవనాయుడు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments