పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
సచివాలయ సిబ్బంది యూనిఫాం ధరించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
గరివిడి (విజయనగరం), ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి) ః
సచివాలయ సిబ్బంది అంతా తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. గరివిడి మండలం కొండపాలెంలోని 1,2,3 సచివాలయాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించకపోవడంపై ప్రశ్నించారు. ఆయా సచివాలయాల్లో రిజిష్టర్లను, సిబ్బంది హాజరును పరిశీలించారు. వివిధ రకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికి కారణాలను ప్రశ్నించారు. జగనన్న కాలనీల నిర్మాణం, ఓటిఎస్ పథకం అమలుపై ఆరా తీశారు. కోవిడ్ వేక్సినేషన్ గురించి ప్రశ్నించారు. మంజూరు చేసిన ప్రతీ ఇంటి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లబ్దిదారులు ముందుకు రాని పక్షంలో, వారికి ఇంటిని రద్దు చేసి, దరఖాస్తు చేసుకున్న ఇతరులకు కేటాయించాలని సూచించారు. ఇసుక, సిమ్మెంటు, ఇనుము ప్రభుత్వమే సరఫరా చేస్తోందని, లబ్దిదారుడు ఇంటిని కట్టి తీరాలని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో చెత్తశుద్ది కేంద్రాన్ని తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. చెత్తను తగులబెట్టకూడదని, దానిని వేరు చేసి, తడిచెత్తతో ఎరువును తయారు చేయాలని సూచించారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతీఒక్కరికీ పోలియో చుక్కలను వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల్లో తాశీల్దార్ టి.గోవింద, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment