యువతి సూసైడ్ యత్నాన్ని నివారించిన 'మహిళా కమిషన్'
- వాట్సప్ సందేశంతో స్పందించిన 'వాసిరెడ్డి పద్మ'
అమరావతి (ప్రజా అమరావతి):
తాత్కాలిక ఆవేశంలో ఓ యువతి ఆత్మహత్యా ప్రయత్నాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నివారించారు. గురువారం రాత్రి ఒక యువతి ఫోన్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశంతో వాసిరెడ్డి పద్మ వెంటనే స్పందించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎట్టకేలకు యువతి ఆత్మహత్యాయత్నాన్ని నివారించగలిగారు. వివారాల్లోకొస్తే... అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామానికి చెందిన ఓ యువతి ఫోన్ నెంబర్ నుంచి గురువారం రాత్రి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు వాట్సప్ సందేశం వచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులు తనను గదిలో బందీ చేశారని.. తాను ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె సందేశంలో పేర్కొంది. దీనిపై తక్షణమే స్పందించిన వాసిరెడ్డి పద్మ ..సందేశం వచ్చిన వాట్సప్ నెంబర్ కు కాల్ చేసి బాధితురాలితో మాట్లాడారు. ఆమె వివరాలు తెలుసుకుంటూనే... మరోవైపు అనంతపురం జిల్లా ఏరియా మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ షేక్ రుకియాబేగంను అప్రమత్తం చేశారు. రుకియాబేగం పర్యవేక్షణలో ఐసీడీఎస్ అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించి ఆ యువతి ఇంటిని గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితురాలిని ముదిగుబ్బ పోలీసు స్టేషనుకు తరలించారు. అక్కడ ఆమెకు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విడివిడిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను సైతం విచారించి యువతి క్షణికావేశ ఆలోచనలను మళ్లించేందుకు ఇంట్లో జాగ్రత్తలు పాటించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మానసికంగా కుంగిపోయిన మహిళలకు జీవితం మీద ఆశ కల్పించి బ్రతకాలనే కోరిక పెంచాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కేంద్రాలను అందుబాటులో తెచ్చేందుకు కృషిచేస్తున్నామని స్పష్టం చేశారు.
addComments
Post a Comment