ప్రతి మనిషి జీవితానికి ఒక ఉన్నత,ఉత్తమ లక్ష్యం ఉండాలి.

  తాడేపల్లి (ప్రజా అమరావతి);      కె.ఎల్.విశ్వవిద్యాలయంలో బి.ఏ. (ఐ.ఏ.ఎస్.అకాడెమి ) విభాగం ఆధ్వర్యంలో విధ్యార్థులు విజయ శిఖరాలను అధిరోహించాలంటే ఎలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం పై అవగాహన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సరిత హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్రతి మనిషి జీవితానికి ఒక ఉన్నత,ఉత్తమ లక్ష్యం ఉండాలని


తెలిపారు.లక్ష్యాన్ని ఏర్పరుచుకునేటప్పుడే తమ బలాలు,బలహీనతలు బేరీజు వేసుకోగలగాలని అన్నారు . కృషితో సాధించలేనిది ఏదీ సృష్టిలో లేదని స్పష్టం చేశారు.నిరంతర శ్రమ , అకుంఠిత దీక్ష , లక్ష్యం మీద నిబద్ధత మనలను విజయపథం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా శారీరిక , మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానమని,వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే దేనిలోనైనా విజయం కరతలామలకమౌతుందన్నారు రమణ మహర్షి చెప్పినట్లు ప్రతి వ్యక్తి " నువ్వెవరు ? అని కాకుండా " నాన యార్ " - నేనెవరు ? అని ప్రశ్నించుకోవాలని తెలిపారు . ఎంతసేపు ఎదుటవారిలోని బలహీనతలను వెతుకుతూ మానుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తీ తనను తాను తెలుసుకోగలిగినప్పుడు మానసిక ప్రశాంతత లభిస్తుందని , ఆ శాంతి అన్ని పోటీ పరీక్షలలో విజయానికి ప్రధాన కారణమౌతుందన్నారు.మహిళలు సెల్ ఫోన్ వాడకం విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలని , సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పారు .రాష్ట్ర మహిళా సంరక్షణ విభాగం ఎస్.పి.గా ఈ విషయాన్ని ప్రత్యేకంగా విధ్యార్థినులు దృష్టికి తీసుకువస్తున్నాని , తమ భద్రత పట్ల ఏ రకమైన అనుమానమొచ్చినా వెంటనే తమను సంప్రదించవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ హ్యూమనిటీస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు,ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగ అధ్యక్షులు డాక్టర్ కె .వెంకటేశ్వర కుమార్,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు .

Comments