గత ప్రభుత్వాలకంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేశాం
తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అపోహలు సృష్టించొద్దు
ప్రత్యేక హోదా, 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంలో ఒక భాగం
రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం, ఫిబ్రవరి 19 (ప్రజా అమరావతి) ః
రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటైన ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హత ఉన్న ప్రతీపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల విషయంలో తప్పుడు ప్రచారాలను చేస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టించొద్దని ప్రతిపక్ష టిడిపికి ఆయన హితవు పలికారు. విజయనగరంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాష్ట్రంలోని వివిధ అంశాలపై మంత్రి స్పందించారు.
అత్యధికంగా ఇళ్లు మంజూరు చేశాం
ఇళ్ల మంజూరు, ఇంటి విస్తీర్ణం విషయంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. సంక్షేమం విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరారు. ప్రతిపక్ష నాయకుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎక్కడికి రావడానికైనా సిద్దంగా ఉన్నానని మంత్రి ప్రకటించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు ఇస్తామన్నది తమ మేనిఫేస్టోలో ఉందని, దానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.30 లక్షల ఇళ్లు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని, అవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. టిట్కో ఇళ్లు ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. గత ప్రభుత్వ హాయాంలో 2.62 లక్షల ఇళ్లను మాత్రమే గ్రౌండింగ్ చేశారని చెప్పారు. వీటిలో 2,05,000 ఇళ్లు 75శాతం నిర్మాణం పూర్తి అయ్యిందని చెప్పారు. దశలవారీగా అన్నిటినీ పూర్తి చేసి, పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించి, లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే టిట్కో ఇళ్ల పంపిణీ ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 325 చదరపు గజాల ఇంటిని తాము పూర్తిగా ఉచితంగా రిజిష్ట్రేషన్ చేసి మరీ ఇస్తున్నామని, 356 గజాలు, 430 గజాల ఇంటికి లబ్దిదారుల వాటాను సగానికి తగ్గించామని చెప్పారు. 62వేల ఇళ్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్లను ఆదా చేశామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జగనన్న కాలనీల్లో ఇంటి విస్తీర్ణంలో మార్పులు చేసి ఇస్తున్నామని, సుమారు 30 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు వివరాలతో సహా వెళ్లడించారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమని, వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అంకిత భావంతో కృషి చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం
విద్యుత్ కోతల విషయంలో తెలుగుదేశం పార్టీ, దానికి అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. ఎన్టీపిసితో తలెత్తిన చిన్నపాటి సమస్య కారణంగా మూడురోజులపాటు రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందని, ఆ తరువాత కోతలు లేకుండా పూర్తిస్థాయిలో విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఇప్పటికీ తప్పడు ప్రచారం చేస్తున్నారంటూ ఖండించారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా, చెత్తపై నామమాత్రపు పన్ను విధించడం జరుగుతోందని చెప్పారు. ఇది ప్రజలకు పెద్ద భారం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరిశరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ పన్నును విధించడం జరుగుతోందని అన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగమేనని మంత్రి పునరుద్ఘాటించారు. వారు కూడా తమ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. పిఆర్‌సిపై అంశాలవారీగా మూడుసార్లు చర్చించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి వివరించామని, వాటికి అందరూ అంగీకరించారని తెలిపారు. ఆ తరువాత ఉపాధ్యాయులు మాటమార్చడం విచారకరమన్నారు. ఒక వర్గం మీడియా, కొందరు నాయకులు ఉద్యోగులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి భంగపడ్డారని ఆరోపించారు. తమది మనసున్న ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలన్న మంచి హృదయమున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని అన్నారు. అధికారుల బదిలీలు పరిపాలనలో ఒక భాగమని, దానిపైనా లేనిపోని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. త్వరలో జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యంత భారీ స్థాయిలో ఇంతకుముందు సుమారు లక్షా,40వేల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినిమా టిక్కెట్లు, రిలీజ్‌లకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల ప్రకారం నిర్ణయాలు ఉంటాయని, వ్యక్తులను బట్టి కాదని బొత్స స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా, 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం
ప్రత్యేక హోదాకు తాము కట్టుబడి ఉన్నామని బొత్స పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో ఎంపిలను ఇస్తే, హోదా సాధనకోసం ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అవకాశం ఉన్న ప్రతిసారీ ఆయన హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మనపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటవ్వడం మన దురదృష్టంగా పేర్కొన్నారు. ఎప్పటికైనా హోదాను సాధించితీరుతామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి అన్నారు. దీనికి అవసరమైన బిల్లును సిద్దం చేస్తున్నామని చెప్పారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేసితీరుతామని స్పష్టం చేశారు. గాజువాక నుంచి మధురవాడ వరకు మెట్రో వేయాలని ముందుగా నిర్ణయించడం జరిగిందని, దీనిని స్టీలుప్లాంటు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి సూచించినలు మేరకు డిపిఆర్‌ను తయారు చేసినట్లు బొత్స వెళ్లడించారు. మెట్రోను ఒకటి లేదా రెండు ప్యాకేజీలుగా పూర్తి చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ దాదాపు పూర్తి అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్లడించారు.
addComments
Post a Comment