- 48 ఏళ్ళు గడిచినా అమరగాయకుడు ఘంటసాల ఆలపించిన పాటలు సజీవం
- ఆయనను తలుచుకోవడమే అదృష్టం
- గుడివాడ వాసి కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణం
- పేద కళాకారులకు సమాఖ్య పెన్షన్లు అభినందనీయం
- ఘంటసాల వర్ధంతి సభలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి
గుడివాడ, ఫిబ్రవరి 11(ప్రజా అమరావతి): 48 ఏళ్లు గడుస్తున్నా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాటలు సజీవంగా ఉన్నాయని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజ బాపయ్య చౌక్ సెంటర్లో గుడివాడ పట్టణ కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల, పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం విగ్రహాలకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో అడపా బాబ్జి మాట్లాడుతూ అమరగాయకుడు ఘంటసాల గుడివాడ ప్రాంత వాసి కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణమని అన్నారు. చిన్ననాటి నుండి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో కృషి, పట్టుదలతో సాధన చేసి సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఘంటసాల 30 వేలకు పైగా పాటలను ఆలపించారని, ప్రతి పాట మధురంగానే ఉంటుందన్నారు. భూమి ఉన్నంత కాలం ఘంటసాల పాడిన పాటలు సజీవంగానే నిలిచిపోతాయని చెప్పారు. పాతాళభైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజార్, శ్రీ వెంకటేశ్వర మహత్యం వంటి సినిమాల్లో పాటలను అద్భుతంగా ఆలపించారని తెలిపారు. భగవద్గీతను ఘంటసాల ఆలపించినంత అద్భుతంగా ఎవరికి సాధ్యం కాదని అన్నారు. దేశ విదేశాల్లోనూ ఘంటసాల ఆలపించిన భగవద్గీత ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. అంతటి మహోన్నత వ్యక్తిని తలుచుకోవడమే అదృష్టమని అన్నారు. గుడివాడ పట్టణం నడిబొడ్డున రాజ బాపయ్య చౌక్ సెంటర్లో ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇదే ప్రాంతంలో పద్మశ్రీ ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహాన్ని కూడా కళాకారులు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. గుడివాడ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు అని తెలిపారు. ఇక్కడి నుండి ఎంతో మంది కళాకారులు ప్రపంచస్థాయి ఖ్యాతిని ఆర్జించారని కొనియాడారు. ప్రస్తుతం కళాకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పేద కళాకారులను ఆదుకునేందుకు గుడివాడ పట్టణ కళాకారుల సమాఖ్య కృషి చేయడం అభినందనీయమని అన్నారు. దాతల సహకారంతో రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా పేద కళాకారులకు పెన్షన్లను ఇచ్చి చేయూత అందించడం గొప్ప విషయమని అన్నారు. మొదటిగా ఎనిమిది మంది పేద కళాకారులకు తన చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. కళాకారులను ఆదుకునేందుకు దాతలు మరింత ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎక్కువమంది కళాకారులకు పెన్షన్లను ఇవ్వడంతోపాటు వారిని ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలను చేపట్టాలని అడపా బాబ్జి సూచించారు. డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవిజీ ఆంజనేయులు మాట్లాడుతూ ఘంటసాల గానం అజరామరమని అన్నారు. నవ రసాలతో పాటు భక్తి రసాన్ని కూడా ఆలపించి ప్రజలను ఉర్రూతలూగించారని కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఘంటసాల అత్యున్నత శిఖరాలకు ఎదిగినప్పటికి ఎంతగానో ఒదిగి ఉండే వారని గుర్తు చేశారు. ప్రముఖ కళాకారుడు భాగవతుల కోదండపాణి మాట్లాడుతూ దాదాపు 30 వేలకు పైగా పాటలను పాడి సంగీత ప్రియులను ఓలలాడించారని చెప్పారు. ఘంటసాలకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైశ్య ప్రముఖుడు బొగ్గరపు తిరుపతయ్య మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో ఘంటసాల అగ్రగణ్యుడని, తెలుగు భాష ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఆయన బతికే ఉంటారని అన్నారు. అనంతరం పేద కళాకారులు జక్కుల కృష్ణకుమారి, చిత్తజల్లు అరుంధతి, కాల్వ అరుణ, నత్తా కమల కుమారి, భాష్యం సీతాకుమారి, అనుమకొండ సాయి కుమారి, దాసరి ముంతాజ్ బేగం, షేక్ జరీనాలకు రూ.వెయ్యి చొప్పున అడపా బాబ్జి పెన్షన్లు అందజేశారు. పలువురు కళాకారులు ఘంటసాల పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు బి రామ మోహన్ రెడ్డి, అధ్యక్షుడు విన్నకోట సత్యనారాయణ (బుజ్జి), ఉపాధ్యక్షులు లోయ రాధాకృష్ణ, ఎల్ ప్రకాష్, టిఎస్ బాబు, బివి సత్యం, డి వరలక్ష్మి, మేడిపల్లి నరసింహారావు, శనగ పాటి నరసింహారావు, పాత శ్యామ్, భాగవతుల ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment