తాడేపల్లి (ప్రజా అమరావతి); కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన 6వ కామన్ రివ్యూ మిషన్ (సిఆర్ఎం) ప్రతినిధుల బృందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించి, వివిధ పథకాల అమలు తీరుపై ప్రసంశల జల్లు కురిపించారు. ఆయా జిల్లాల్లోని ఒక్కొక్క మండల౦లో ఒక్కొక్క గ్రామ పంచయతీ చొప్పున క్షేత్ర పర్యటన జరిపి లబ్దిదారులను కలుసుకుని మాట్లాడి, వారి అభిప్రాయాలను సేకరించారు. మన రాష్ట్రంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అశోక్ పంకజ్, ఎం.కె. గుప్త, నీతి అయోగ్ గ్రామీణాభివృద్ధి డిప్యూటీ అడ్వైజర్ వందన శర్మ, ఎన్.ఐ.ఆర్.డి పిఆర్- ఎన్.ఇ.ఆర్.సి అసిస్టెంట్ ప్రొఫెసర్ అలజంగి సింహాచలం ఒక బృందంగా ఏర్పడి ఫిబ్రవరి 18, నుంచి ఫిబ్రవరి 22 వరకు రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పథకాలైన ఎంజిఎన్ఆర్ఇజిఎస్, పిఎం.కె.ఎస్.వై, డిడియు-జికెవై, పిఎం.జి.ఎస్.వై, పిఎం.ఎ.వై (హౌసింగ్) ఎస్.ఎజి.వై, సెర్ప్ అమలు తీరు తెన్నులను పరిశీలించారు.
పథకాల లక్ష్యం నేరవేరుతున్నదా లేదా, ఒకవేళ లేనట్లయితే దానికి కారణాలు ఏమిటి, అమలులో ఉత్తమ ఆచరణలు, పథకాల పట్ల ప్రజల సంతృప్తి, అసంతృప్తులను, ఆమోదాలు ఎలా ఉన్నాయి. అమలు తీరులో ఉన్న అంతరాలు, సవరించుకోవాల్సిన అంశాలు తదితరాల అన్నింటిని ఈ బృందం పరిశీలించి, ప్రజల ఆలోచనలు, అమలు తీరు, సలహాలు సూచనలు వీటన్నింటిని క్రోడీకరించి నివేదిక రూపంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ బృందం పర్యటన లక్ష్యం ఇదే.
క్షేత్ర పర్యటన అనంతరం బుధవారం అంటే 23-2-2022న తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వివిధ పథకాల అధికారులతో సిఆర్ఎం బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ అమలు పటిష్టంగా, సమగ్రంగా అమలవుతోందని, ఉపాధి హామీలో చేపడుతున్న రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమ౦ అద్భుతంగా ఉందని, అరకులోని కాఫీ తోటల గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరిగిందని, వ్యక్తిగతంగా లాభాలు పొందుతున్నారని సమీక్షా సమావేశ౦లో అన్నారు.
ఎంజిఎన్ఆర్ఇజిఎస్ మెటీరియల్ నిధులతో నిర్మిస్తున్న సచివాలయాల భవనాలు గ్రామాల రూపురేఖలు మార్చివేస్తున్నాయని, ఇది దేశానికే ఆదర్శంగా ఉందని,
అనేక సేవలు గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ దేశమంతా పెట్టాలని సిఫార్స్ చేయబోతున్నామని అంటూ, డిబిటి కన్నా రాష్ట్రంలో ప్రతి నెల మొదటి తారీఖునే ఇంటింటికి తిరిగి ఇస్తున్న పెన్షన్ విధానం అద్భుతంగా ఉందని, వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని బృందం సభ్యులు ప్రసంశించారు. చెత్త సేకరించి దానిని సేంద్రియ ఎరువుగా మార్చి, రసాయన రహిత సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ౦పై ప్రసంశలు కురిపించారు. రాష్ట్రంలో ఆయా పథకాల అమలులో ఉద్యోగస్తులు ఆశక్తిగా, చురుకుగా పనిచేస్తూ అద్భుత పటిమను కనపరుస్తున్నారని వారు అన్నారు. అలాగే బృందం సభ్యులు మాట్లాడుతూ ఇజిఎస్ లో వ్యక్తిగత ఆస్తులు ఏర్పాటు చేసే పనుల సంఖ్యను పెంచుకోవాలని, పిఎంజిఎస్ వై నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాల కృష్ణా ద్వివేది మాట్లాడుతూ ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచాలని, వేసవి భత్యం అమలుకు అనుమతించాలని, ఉపాధి హామీ నిధులను పారిశుద్ధ్య కార్యక్రామలకు కూడా వినియోగించుకునేలా సిఫార్స్ చేయాలని సిఆర్ఎం బృందాన్ని కోరారు.
ఈ కార్యక్రమ౦లో కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ గుప్తా, పంచాయతీరాజ్ ఈఎన్.సి సుబ్బారెడ్డి, ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య జాయింట్ కమిషనర్ ఎ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment