ప్రైవేటు స్కూళ్లల్లో కౌన్సిలింగ్ కేంద్రాలు - గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు


ప్రైవేటు స్కూళ్లల్లో కౌన్సిలింగ్ కేంద్రాలు

- గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు


- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి


అమరావతి (ప్రజా అమరావతి);


విద్యార్థులు, యువతలో ఆత్మస్థైర్యం,మనోనిబ్బరం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లల్లో కౌన్సిలింగ్ కేంద్రాలు అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. పలు కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా నడిపించేందుకు సిద్ధమైనట్లు ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్రాల్ని ప్రారంభిస్తామని.. రాష్ట్రవ్యాప్త అమలుకు ప్రభుత్వానికి మహిళా కమిషన్ సూచనలతో కూడిన లేఖను పంపామన్నారు. 

ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 'స్పందనా ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో కౌన్సిలర్ల శిక్షణా శిబిరానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి అధ్యక్షతన జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. హైస్కూలు స్థాయి నుంచి కళాశాల స్థాయి విద్యార్థులకు కౌన్సిలింగ్ అవసరమని.. ఆమేరకు కౌన్సిలింగ్ ప్రక్రియపై ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగానే కౌన్సిలింగ్ ప్రక్రియలో 

ఇప్పటికే స్పందన ఈదా ఫౌండేషన్ అండగా నిలబడటంలో ముందుంటుందని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.  విద్యార్థులకు  స్టడీ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్,  ఫైనాన్షియల్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం భేష్ అంటూ ఆమె కితాబునిచ్చారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతోందనేది నిజమేనని ..గురువుల స్థానంలోనే ఎక్కువ కృషి ఉంటుందని అన్నారు. విద్యార్థుల్లో మోటివేషన్, సానుకూల దృక్పథం లకు అక్కడే బీజం పడుతుందని వివరించారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు, యువత పట్ల వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. యువత నిరాశా నిస్పృహల నుంచి  బయట పడితేనే చదువుపై శ్రద్ధ పెరుగుతుందన్నారు.  పాత రోజుల కంటే నేటి ఆధునిక సమాజంలోనే అవకాశాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. నేటి కాలంలో ఐఐటి మెడిసిన్ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను సరిహద్దులతో సంబంధం లేకుండా విద్యార్థులు అందిపుచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి హైదరాబాదు, వరంగల్ నుంచి కౌన్సిలింగ్ నిపుణులు సదస్సుకు హాజరుకాగా... వాసిరెడ్డి పద్మ చేతులమీదుగా వారికి సర్టిఫికేట్ల ప్రదానం చేశారు.  కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎన్ యూ సైకాలజీ విభాగాధిపతి సరోజ, సీనియర్ కౌన్సిలర్లు  కృష్ణభరత్, నాగూల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

Comments