న్యాయమూర్తిగా జస్టిస్ ఎంవి.రమణ సేవలు అభినందనీయం:హైకోర్టు సిజె.పికె మిశ్రా

 న్యాయమూర్తిగా జస్టిస్ ఎంవి.రమణ సేవలు అభినందనీయం:హైకోర్టు సిజె.పికె మిశ్రా



అమరావతి,11 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.వి.రమణ న్యాయవ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎం.వి.రమణకు హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘణంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తిగా రెండున్నర సంవత్సరాలు పాటు పనిచేసిన జస్టిస్ ఎం.వి.రమణ సుమారు 2వేల 900 కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.న్యాయవాదుల కుటుంబం నుండి వచ్చిన రమణ తిరుపతి,బెంగుళూర్ లలో కళాశాల విద్యను అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్ఎం డిగ్రీని పొందారని చెప్పారు.1987 జిల్లా మున్సిప్ కోర్టు జడ్జిగా ఎంపికై సేవలందించారని,సిబిఐ కోర్టు ప్రిసైండింగ్ అధికారిగా ఉత్తమ సేవలందించారని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.పదవీ విరమణ చేస్తున్నజస్టిస్ ఎం.వి.రమణ శేష జీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగేలా దీవించాలని ఆభగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కూమార్ మిశ్రా పేర్కొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్నజస్టిస్ ఎం.వి.రమణ మాట్లాడుతూ ముందుగా తన పదివీ కాలంలో అన్నివిధాలా తోడ్పాటును అందించిన ప్రధాన న్యాయమూర్తి సహా సహచర న్యాయమూర్తులు,రిజిష్ట్రార్లు,న్యాయవాదులు,ఇతర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు.హైకోర్టు న్యాయమూర్తిగా ఇక్కడ సేవలందించే అవకాశం కలిగినందుకు తన హృదయమంతా పూర్తిగా సంతోషంతో నిండిపోయిందని పేర్కొన్నారు.తన పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు జస్టిస్ ఎం.వి.రమణ చెప్పారు.

అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత రెండున్నర యేళ్ళుగా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.వి.రమణ అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యంగా సిబిఐ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా జస్టిస్ రమణ ఉత్తమ సేవలందించారని తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాదుల కుటుంబం నుండి వచ్చిన జస్టిస్ ఎం.వి.రమణ తన కళాశాల విద్యను తిరుపతి ఎస్వి జూనియర్ కళాశాలలో చేశారని,ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్ఎం డిగ్రీని పొందారని చెప్పారు.1987లో జిల్లా మున్సిఫ్ కోర్టు జడ్జిగా ఎంపికయ్యారని, 1993లో సబ్ జడ్జిగా నెల్లూరు,కర్నూలలో పనిచేశారని తెలిపారు.అలాగే వరంగల్,కర్నూల్ జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారని తెలిపారు.

బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మట్లాడుతూ జస్టిస్ ఎంవి.రమణ ప్రతి ఒక్కరితోను స్నేహపూర్వకంగా చిరునవ్వుతో వ్యవహరించేవారని తెలిపారు.పదవీ విరమణ అనంతరం యువ న్యాయవాదులకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.అదనపు సొలిసిటర్ జనరల్ హరనాధ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఉత్తమ న్యాయమూర్తిని కోల్పోతోందని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు,రిజిష్ట్రార్లు,బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

     

Comments