కన్నతల్లిపై కర్కశత్వమా..?
- వృద్ధుల్ని హింసిస్తే చూస్తూ ఊరుకునేదిలేదు..
- తాడేపల్లిలో కొడుకు, కోడలు కాఠిన్యంపై 'వాసిరెడ్డి పద్మ' ఆగ్రహం
- బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
- కేసును సుమోటోగా స్వీకరణ
- సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద విచారణకు ఆదేశాలు
తాడేపల్లి(గుంటూరు జిల్లా) (ప్రజా అమరావతి):
తల్లి పట్ల కన్నకొడుకు కర్కశత్వంతో ప్రవర్తిస్తాడా...? మనిషా..పశువా..? ఇంట్లో నాలుగు గోడల మధ్య మహిళలను హింసిస్తామంటే.. ఎవరూ చూస్తూ ఊరుకోరంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. సభ్య సమాజం తలదించుకునే సంఘటనల పట్ల చట్టాలతో పాటు సమాజం చేతులకూ పని చెప్పాల్సి వస్తుందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామంలో కొడుకు చేతిలో చిత్రహింసలకు గురైన బాధితురాలు నాగమణిని శనివారం ఆమె ఇంట్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడుతూ.. ఆమెను కొడుకు విచక్షణారహితంగా హింసించడాన్ని వింటూ వాసిరెడ్డి పద్మ తట్టుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వృద్ధురాలి కాళ్లు, చేతులు, వీపు, మెడభాగాన దెబ్బలకు సంబంధించిన గుర్తులను వాసిరెడ్డి పద్మ స్వయంగా పరిశీలించారు. కొడుకు, కోడలు ఎన్నాళ్లుగా హింసపెడుతున్నారని ఆరా తీశారు. నెలవారీ పెన్షన్ పై వాలంటీర్ ను పిలిపించి మాట్లాడారు. ఆమెకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం కుదుటపడే వరకు శ్రద్ధ తీసుకోవాలని స్థానిక ప్రజారోగ్య వైద్యాధికారికి వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. బాధితురాలు చేతికి పండ్లు అందించి.. ఆమె భుజంపై చెయ్యేసి.. మహిళా కమిషన్ కొండంత అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. బాధితురాలు వద్దకు ఆమె కోడలు, మనువడిని పిలిపించి వాసిరెడ్డి పద్మ స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు.
సాక్షాత్తూ సీఎం అవ్వా..తాత అంటుంటే..
బాధితురాలిని పరామర్శించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. వృద్ధులు కుటుంబాలకు భారం కాకూడదని, ప్రభుత్వం ప్రతీనెలా రూ.2500లు వృద్ధాప్య పెన్షన్ అందిస్తుందన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వృద్ధులను అప్యాయంగా అవ్వాతాత అంటూ పిలుచుకుంటుంటే.. కుటుంబ సభ్యులు వారిపట్ల కాస్తంత ప్రేమ చూపకపోగా చచ్చేలా కొడతారా..? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. భార్య, తల్లిపై హక్కంటూ.. ఇంట్లో నాలుగ్గోడల మధ్య మహిళలను హింసిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.
కన్న తల్లి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి, కొట్టడమంటి దుర్మార్గాలు, దురాగతాలు సమాజానికి సిగ్గుచేటన్నారు.
ఈ కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నిందితుడు శేషుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోదుతో పాటు బాధితురాలి పోషణ, రక్షణ, ఆరోగ్యంపై తక్షణ చర్యలు చేపట్టాలని గుంటూరు ఆర్డీవోను వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.
కుటుంబ సభ్యులు అందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి.. బైండోవర్ చేయించాలని పోలీసులకు సూచించారు. ఇంతటి దారుణ ఘటనను వెలుగులోకి తెచ్చి బాధితురాలి పక్షాన నిలిచిన బ్రహ్మానందపురం వార్డు సచివాలయ అడ్మిన్ పవిత్ర, వాలంటీర్ దుర్గా కల్యాణి, మహిళా పోలీసు సుమతిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాసులు రెడ్డి, మంగళగిరి సీడీపీవో గౌరీశంకర్, మున్సిపల్, మెప్మా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment