ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్న‌ ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిదే




ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్న‌ ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిదే



ఇచ్చిన మాట త‌ప్ప‌ని ముఖ్య‌మంత్రి వైస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి


రాష్ట్ర నీటిపారుద‌ల  శాఖామంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌


తోట‌ప‌ల్లి ప్యాకేజ్‌-2 ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రులు



పూస‌పాటిరేగ‌, విజ‌య‌న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 20 (ప్రజా అమరావతి) ః 


          రాష్ట్రంలో ప్రాజెక్టుల‌ను పూర్తి చేసిన ఘ‌త‌న త‌మ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖామంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. స‌ర్దార్ గౌతుల‌చ్చ‌న్న తోట‌ప‌ల్లి ప్రాజెక్టు నిర్మాణాన్నిగ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రారంభిస్తే, దానిని పూర్తి చేస్తున్న ఖ్యాతి నేటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి దక్క‌నుంద‌ని అన్నారు. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసే తోట‌ప‌ల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విశేష కృషి చేస్తున్నార‌ని చెప్పారు. సుమారు రూ.63 కోట్ల‌తో ప్ర‌తిపాదించిన‌ తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ప్యాకేజీ-2 ప‌నుల‌ను పూస‌పాటిరేగ మండ‌లం గుండ‌పురెడ్డి పాలెం వ‌ద్ద మంత్రి శంకుస్థాప‌న చేశారు. 



          ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల‌ను ప్రారంభించి, వాటిని పూర్తి చేసిన ఘ‌న‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని మంత్రి అన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతుల‌మీదుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అయిన దాఖ‌లాలు లేవ‌న్నారు. శ్రీ‌కాకుళం నుంచి కుప్పం వ‌ర‌కూ ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశామ‌ని చంద్ర‌బాబు చెప్పుకోగ‌ల‌రా ? అని మంత్రి ప్ర‌శ్నించారు. ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి కోసం రూ.6వేల కోట్లు ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డం జ‌రిగింద‌ని, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న‌ప్ప‌టికీ, అభివృద్దీకి, సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. బాబు హ‌యాంలో ఏ ప‌థ‌కాన్ని ఎలా ఎగ్గొట్టాలా అన్న ఆలోచ‌న త‌ప్ప‌, మ‌రోయోచ‌న లేద‌న్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా 90 శాతం పైగా స్థానాల్లో స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించామంటే, అందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌న్నారు. భ‌విష్య‌త్తు ఎన్నికల్లో కూడా త‌మ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని, దేశంలోని అన్ని పార్టీలు క‌లిసివ‌చ్చినా త‌మ‌దే విజ‌య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.



              రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాలు ఒక‌ప్పుడు సాగునీటి కోసం వ‌ర్షాల‌పైనే ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఉండేద‌ని, వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి ఆలోచ‌న‌తో తోట‌ప‌ల్లి ప్రాజెక్టు రూపుదాల్చాక ప‌రిస్థితులు మారాయ‌న్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేతుల‌మీదుగా తోట‌ప‌ల్లితో పాటు, రామ‌తీర్ధ‌సాగ‌ర్ ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. తోట‌ప‌ల్లి రెండు బ్రాంచ్ కెనాల్స్ పూర్తి అయితే, సుమారు 57,000 ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లో ల‌క్షా,30వేల ఎక‌రాల‌కు స్థిరీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఒక‌ప్పుడు పంట‌లు పండించ‌డం ఎలా అని ఎదురుచూసే రైతులు, ప్ర‌స్తుతం ఆ పంట‌ల కొనుగోలుపై ఆందోళ‌న చెందుతున్నార‌ని అన్నారు. పంట‌ల విష‌యంలో రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌న్నారు.  ప్ర‌తీ ధాన్యపు గింజ‌నూ కొనుగోలు చేస్తామన్న‌ది ముఖ్య‌మంత్రి మాట‌గా ప్ర‌క‌టించారు. కొంత‌మంది నాయ‌కుల్లా మాయ‌మాట‌లు చెబుతూ, ప్ర‌జ‌ల‌ను మోసం చేసే అల‌వాటు త‌మ‌కు లేద‌న్నారు.  నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.  చంద్ర‌బాబు చెప్పే అవాకులు, చ‌వాకుల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. 


               నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సిలు డాక్ట‌ర్ పి.సురేష్‌బాబు, ఇందుకూరి ర‌ఘురాజు, పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, పాల‌వ‌ల‌స విక్రాంత్‌, ఎంఎల్ఏలు కంబాల జోగులు, సంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, గొర్లె కిర‌ణ్‌కుమార్‌, ప‌లువురు స్థానిక నాయ‌కులు, నీటిపారుద‌ల శాఖ అధికారులు పాల్గొన్నారు. 



Comments