విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని..



                  


అమరావతి (ప్రజా అమరావతి):


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో యువతకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధిశిక్షణ శాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డిలు ఆన్ లైన్ ద్వారా వాట్సాప్ డిజిటల్ స్కిల్ అకాడమి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. 


వాట్సాప్ ఇండియా, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమానికి శిక్షణ భాగస్వామిగా ఇన్ఫీస్పార్క్ సంస్థ వ్యవహరిస్తోంది.  ఇప్పటి వరకు  వాట్సాప్ డిజిటల్ స్కిల్ అకాడమి ట్రైనింగ్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 15వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరికీ 10వ తేదీ నుంచి  10 రోజులపాటు ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరం ఇన్ఫీస్పార్క్ సంస్థ వారందరికీ ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని వాట్సాప్ స్కిల్స్ స్టార్ ప్రోగ్రామ్ కింద ఏడాదిపాటు శిక్షణకు ఎంపిక చేసుకుంటారు. శిక్షణలో ప్రధానంగా ఉపాధి నైపుణ్యాలతోపాటు డేటా గోప్యత, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత, నానో ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాలపై అవగాహన కల్పిస్తారు. కమ్యునికేషన్ స్కిల్స్, నాయకత్వం, కమ్యునిటీ బిల్డింగ్ స్కిల్స్ (సమాజ నిర్మాణ నాయకత్వం), బహిరంగ సమావేశాల్లో ప్రసంగించడం, సృజనాత్మకత, సహకారంలాంటి విషయాలపై శిక్షణ ఇస్తారు. అక్కడా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఉద్యోగం పొందడంలో వాట్సాప్ ఇండియా సహకారం అందిస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు కూడా తనవంతు సహకారం అందిస్తుంది. 


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అనేక వినూత్నమైన శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని..


ఇందులో భాగంగా ఇటీవల జాతీయస్థాయిలో జరిగిన నైపుణ్య పోటీల్లోనూ మన రాష్ట్రం తరుఫున పాల్గొన్నవారు మంచి ప్రతిభ కనబరిచారని చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. 


అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు  కాలేజీలో చేరి వారి చదువులు పూర్తిచేసుకుని బయటకు వచ్చేసమయంలోనే వారికి అదనపు నైపుణ్యాలు అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పలు మల్టీనేషనల్ కంపెనీలతో కలిసి వినూత్న శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు వాట్సాప్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని.. విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని కొండూరు అజయ్ రెడ్డి సూచించారు. 


ఇన్ఫీస్పార్క్ ఫౌండర్, సీఈవో ఓషిన్ చావన్ మాట్లాడుతూ.. ఎపిఎస్‌ఎస్‌డిసి రాష్ట్రంలోని యువతకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోందని.. ఇప్పుడు ఆ సంస్థతో కలిసి యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డితోపాటు  ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డి, జనరల్ మేనేజర్ గోపినాథ్, ఎన్ఎస్డిసీ స్టేట్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ ప్రశాంత్, ఇన్ఫీస్పార్క్ ఫౌండర్, సీఈవో ఓషిన్ చావన్ తోపాటు వివిధ జిల్లాల నుంచి ఆన్ లైన్ ద్వారా ఆయా కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments