గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి
అధికారులు చిత్తశుద్ధితో, సమన్వయంతో పనిచేయాలి
ఇళ్లు నిర్మించుకోలేని వారికి సహకరించాలి
గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ గృహహక్కు రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తిచేయాలి
స్పందన వినతులకు కాలపరిమితిలోగా, నాణ్యతతో కూడిన పరిష్కార చూపాలి
పార్వతీపురం డివిజన్ ఆన్ లైన్ సమీక్షలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి):
జిల్లాలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మంజూరు చేసిన ఇళ్లను లబ్దిదారులంతా త్వరగా నిర్మించుకొనేలా మండల స్థాయి అధికారులు మరింత చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. ఇళ్లస్థలాలు చదును చేయాల్సిన చోట గృహనిర్మాణ సంస్థ సహకారంతో వాటిని చదునుచేసి వెంటనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని ఎంపిడిఓలు, తహశీల్దార్‌లతో గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు, ఉపాధిహామీ కన్వర్జెన్స్ పనులు, ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా, స్పందన వినతుల పరిష్కారం వంటి అంశాలపై మంగళవారం ఆన్ లైన్ కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు. ఒకే మహిళ వున్న కుటుంబాలకు ఇళ్ల మంజూరు జరిగిన చోట వారు ఇళ్లు నిర్మించుకొనేందుకు సంబంధిత గ్రామ ప్రతినిధుల నుంచి తగినంత సహకారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివిజనులోని మక్కువ, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో గృహనిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదని ఈ మండలాల్లోని మండలస్థాయి అధికారులు మరింత చొరవ చూపి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ కార్యదర్శి రోజులో కనీసం ఒక్క ఇళ్లయినా నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లో ఇళ్లనిర్మాణాలను కూడా చేపట్టేలా మండలస్థాయి అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) మయూర్ అశోక్ చెప్పారు.
మండల స్థాయిలో ప్రతి మంగళవారం అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో కన్వర్జెన్స్ సమావేశాలు నిర్వహించి ఆయా సమావేశాల్లో వివిధ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి సమిష్టిగా ప్రయత్నం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను మూడో ఆర్డర్ ఇసుక రీచ్‌ల నుంచి తీసుకోవచ్చని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ చెప్పారు. ఆయా మండలాల్లో అవసరానికి, సరఫరాకు మధ్య వ్యత్యాసం వుంటే ఆయా మండలాల్లో ఇసుకను వేరే ప్రాంతాల నుంచి రప్పించి సరఫరా చేస్తామన్నారు.
గిరిజన ప్రాంతాల్లో జగనన్న సంపూర్ణ గృహహక్కు కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేనందున సమీప ప్రాంతాల్లోని మార్కెట్ వాల్యూ ప్రకారం ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని చెప్పారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ ఈ విషయంలో రిజిస్ట్రేషన్లు త్వరగా చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చెప్పారు.
స్పందనలో వచ్చిన వినతులకు సంబంధించి నిర్దేశిత కాలపరిమితిలో, నాణ్యమైన పరిష్కారాలను చూపాల్సి వుంటుందని కలెక్టర్ ఆదేశించారు. రెవిన్యూ అంశాలకు సంబంధించిన వినతులను పరిష్కరించేటపుడు జాగ్రత్త వహించాలన్నారు.
ఉపాధిహామీ కన్వర్జెన్స్ నిధులతో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, మిల్క్ కూలింగ్ కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాల నిర్మాణంపై జె.సి(అభివృద్ధి) మహేష్ కుమార్ సమీక్షించారు. ఇప్పటివరకూ నిర్మాణం కాని భవనాలపై జె.సి. సమీక్షిస్తూ గ్రామం వారీగా ఏయే సమస్యలతో నిర్మాణం ప్రారంభం కాలేదో నివేదించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఉపాధిహామీ పనుల నిర్వహణలో ఎంపిడిఓలు కూడా క్రియాశీలక పాత్ర నిర్వహించాల్సి వుందని జె.సి(అభివృద్ధి) డా.మహేష్ కుమార్ చెప్పారు. మండలంలో జరిగే పనులకు వారే ఇకపై బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. జిల్లాలో ఉపాధిహామీ కింద 1173 పనులు రూ.53.18 కోట్లతో మంజూరు చేశామని డ్వామా పి.డి. ఉమా పరమేశ్వరి చెప్పారు. పాఠశాలల ప్రహారీగోడలు, శ్మశాన వాటికలు, అప్రోచ్ రోడ్లు, పైప్ కల్వర్టులు వంటి పనులను ప్రతిపాదించామన్నారు.
addComments
Post a Comment