పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పంపిణీ

  నెల్లూరు (prajaamaravati);



రైతన్నకు అన్నివిధాలగా  అండగా, తోడుగా వుంటూ  ఏ సీజన్ల్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానీ నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


భారీ వర్షాలు, వరదల కారణంగా గత నవంబర్ నెలలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పంపిణీ


కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ,  ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్ట పోయిన ప్రతి రైతుకు  పూర్తి పరిహారం అందాలని, అదీ సకాలంలో ఆందాలన్న లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.  అందులో భాగంగా  2021 నవంబర్ మాసంలో  కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా  రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ క్రింద రూ. 542.06 కోట్ల రూపాయలు,  1,220 గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పధకం క్రింద రూ. 29.51 కోట్ల రూపాయలు  మొత్తం రూ. 571.57 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. గతంలో పంట నష్ట పోతే నష్ట పరిహారం రైతులకు  పూర్తి స్థాయిలో  అందక పోగా, అందిన నష్ట పరిహారం కూడా సకాలంలో అందేదీకాదని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం   ఏ సీజన్లో  జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానీ నష్ట పరిహారాన్ని చెల్లించి రైతులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు.


కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి ఈ వీడియో కాన్ఫెరెన్సుకు   జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి,  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ హరెంధిర ప్రసాద్,  వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఆనంద కుమారి,  వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు  పాల్గొన్నారు.


అనంతరం  జిల్లాలో గత  సంవత్సరం నవంబర్ మాసంలో  కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా  పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేట కారణంగా నష్ట పోయిన  2,584 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ క్రింద  రూ.1.85 కోట్ల రూపాయల చెక్కును మరియు వైఎస్ఆర్  యంత్ర సేవా పధకం క్రింద జిల్లాలోని 85 గ్రూపులకు    సబ్సిడీ కింద రూ. 1.92 కోట్ల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డితో  కలసి  రైతులకు  అందజేసారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మీడియాతో  మాట్లాడుతూ,  జిల్లాలోని ప్రధాన  జలాశయాలైన   సోమశిల, కండలేరు  ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం జరుగుచున్నదన్నారు.    గత సంవత్సరం నవంబర్ నెలలో జిల్లాలో పంట నష్ట పోయిన 2,584 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ క్రింద  రూ.1.85 కోట్ల రూపాయలను  ఈ రోజు ముఖ్యమంత్రి గారు నష్ట పోయిన   రైతుల ఖాతాలల్లో జమ చేయడం జరిగిందని, అలాగే  వైఎస్ఆర్ యంత్ర సేవా పధకం క్రింద 85 గ్రూపులకు  1.92 కోట్ల రూపాయలు సబ్సిడీ  మంజూరు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల మాగాణి సాగులో వుందని,   వ్యవసాయం లాభసాటిగా వుండాలని రాష్ట్ర ప్రభుత్వం  రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి  వాటి ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ పై అందించడంతో పాటు, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగు చున్నదని కలెక్టర్ తెలిపారు.   రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు   గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఏ సీజన్ల్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానీ నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు. పంట నష్ట పోయిన రైతులకు సబ్సిడీ తో  విత్తనాలు అందిస్తూన్నట్లు కలెక్టర్ తెలిపారు.  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని వైఎస్ఆర్ యంత్ర సేవా పధకం క్రింద   రైతు భరోసా కేంద్రం స్థాయిలోనే  కష్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి  రైతులకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు  అందించడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రతి నియోజక వర్గ స్థాయిలో ఇంటెగ్రేటెడ్ ల్యాబ్ లను ఏర్పాటు  చేసి  భూ పరీక్షలు నిర్వహించడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం జరుగుచున్నదని  కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో ఈ సంవత్సరం 280 కోట్ల రూపాయలు రైతులకు పంట రుణాల కింద మంజూరు చేయడం జరిగిందని, దీనివలన 2.50 లక్షల  రైతు కుటుంబాలకు లబ్ది చేకూరిందని కలెక్టర్ తెలిపారు. దేశ స్థాయిలో జిల్లాకు పి.ఎం. కిసాన్ అవార్డ్ కూడా రావడం జరిగిందని,  రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలక్ష్యంతో కృషిచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.


నష్టపరిహారం పొందిన రైతుల మనోభావాలు:   

.................


1. శ్రీ ముంగర శివకుమార్, రైతు, జొన్నవాడ గ్రామం, బుచ్చిరెడ్డిపాలెం మండలం :

మాకు 2.60 ఎకరాల  మాగాణి  భూమి వుందని,  ఆ భూమిలో వరి పంట వేయగా,  గత  సంవత్సరం నవంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల  వరి పంట దెబ్బతినడంతో పాటు  భూమిలో ఇసుక మేట వేయడం జరిగింది.  అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలిచి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని భరోసా ఇవ్వడం జరిగిందని,  నేడు ముఖ్యమంత్రి గారు  నష్ట పరిహారం మంజూరు చేయడం ఎంతో సంతోషంగా వుందని, ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని బుచ్చిరెడ్డిపాలెం మండలం, జొన్నవాడ గ్రామం రైతు   శ్రీ  ముంగర శివకుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.


2. శ్రీ జి రాజశేఖర్ రెడ్డి, రైతు, సంగం గ్రామం మరియు మండలం:

మాకు 2.50 ఎకరాల  మాగాణి  భూమి వుందని,   అలాగే 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం వరి పంట వేయడం జరిగింది. గత  సంవత్సరం నవంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల  వరి పంట పూర్తిగా దెబ్బతిని నష్ట పోవడం జరిగిందని,   నష్ట పరిహారం క్రింద 22 వేల రూపాయలు  మంజూరు చేయడం పట్ల  సంగం మండలం, సంగం గ్రామానికి చెందిన రైతు శ్రీ జి. రాజశేఖర్ రెడ్డి  తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.  గతంలో పంట నష్ట పోతే  పూర్తి స్థాయిలో సకాలంలో పంట నష్ట పరిహారం అందేదికాదని,  గౌరవ ముఖ్యమంత్రి గారు  రైతులకు అండగా వుంటూ  ఏ సీజన్ల్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లోనే  నష్ట పరిహారాన్ని మంజూరు చేయడం ఎంతో సంతోషం గా వుందని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు  శ్రీ జి. రాజశేఖర్ రెడ్డి  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


3. శ్రీ చెముడుగుంట కిరణ్ కుమార్, రైతు, చల్లాయపాలెం, బుచ్చిరెడ్డిపాలెం మండలం :

నేను 2 ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందని,  గత నవంబర్ మాసంలో వచ్చిన వరదల వలన  వరి పంట  నష్టపోవడం జరిగిందని,  రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు  మూడు నెలల లోపు  మాకు నష్ట పరిహారం అందించడం ఎంతో సంతోషంగా వుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు  శ్రీ కిరణ్ కుమార్ తెలిపారు.  రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని, ముఖ్యంగా  రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి  రైతులకు అవసరమైన అన్నీ సేవలను గ్రామ స్థాయిలోనే అందించడం జరుగుచున్నదని, గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కోసం దగ్గరలోని మండల కేంద్రాలకు గాని, జిల్లా కేంద్రానికి గాని వెళ్లాల్సి వచ్చేదని, నేడు ఆర్.బి.కె స్థాయిలోనే రైతులకు అవసరమైన అన్నీ సేవలు అందడం పట్ల  ఎంతో సంతోషంగా వుందని శ్రీ కిరణ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Comments