గోశాలల నిర్వహణకు మోడల్ ప్రాజెక్టు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ఎంపిక చేసిన గోశాలల్లో ప్రకృతి వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీపై ఇస్కాన్ సంస్థ సహకారంతో శిక్షణ ఇవ్వాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం గోసంరక్షణ కార్యకలాపాలపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గోశాలలు ఉన్నాయని, వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. ఇందుకోసం ఇస్కాన్ సంస్థ ముందుకొచ్చిందని, గోశాలల నిర్వహణ, శిక్షణపై మోడల్ ప్రాజెక్టుగా ఒక గోశాలను రూపొందించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, గో ఆధారిత ఉత్పత్తుల తయారీతోపాటు గోవు విశిష్టతను గోశాల నిర్వాహకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇస్కాన్ సంస్థ, గోశాల నిర్వాహకులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి టిటిడి భాగస్వామ్యంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి 15 రోజులకోసారి ఎస్వీబీసీలో గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, గోసంరక్షణపై ఒక కార్యక్రమం ప్రసారం చేయాలని కోరారు.
అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం డిజైన్లపై ఈవో అధికారులతో చర్చించారు. ధ్యానమందిరం, చుట్టుపక్కల ప్రహరీ, పూలతోటలు, బృందావనం చుట్టూ వెంగమాంబ రచనలను భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, కర్ణాటక సత్రాల ప్రాంతంలో యాత్రికుల వసతి సముదాయం, కల్యాణమండపం తదితర నిర్మాణ పనులను సమీక్షించి వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా.హరనాథరెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కశాళాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment