స్వతంత్రం వచ్చిన తర్వాత భాష ఆధారంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అయ్యాయని

 చింతలపూడి (ప్రజా అమరావతి);


తెలుగు భాషను కించపరుస్తూ  చింతలపూడి శాసన సభ్యులు ఎలిజా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ స్థానిక cpi కార్యాలయం లో సాహిత్య కళా సంఘాల సమావేశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి బి. నాగాస్త్ర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వతంత్రం వచ్చిన తర్వాత భాష ఆధారంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అయ్యాయని


, ఒక జాతి అభివృద్ధి చెందాలంటే అది కేవలం భాష వల్లనే సాధ్యం అవుతుందని, ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచనల మేరకే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందని ఆయన తెలిపారు. తెలుగుజాతి నివసించే రాష్ట్రంలో తెలుగు సబ్జెక్టు ఒక హింస గా మారిందని, తెలుగు వ్యాకరణం నిత్యజీవితంలో ఉపయోగం లేదు అని చెప్పిన ఎలిజా గారి అభిప్రాయం ప్రకారం ముందు వారి రాజకీయ పార్టీ పేరు తెలుగు నుండి తొలగించాలని, తెలుగు ప్రజలు ఎన్నుకున్న ఆయన శాసనసభ్యత్వాన్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు.


ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి మంగరాజు విద్యా రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం గొప్పలు చెప్పుకునేందుకు తెలుగు భాషను కించపరచడం హేయమైన చర్య అని అన్నారు. తెలుగువాడిగా పుట్టి కనీస అవగాహన లేకుండా తెలుగు భాషను అవమానించటం సమంజసం కాదని తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతోందని, మాతృభాషలో విద్యాబోధన జరిగితే విద్యార్థులు సులభంగా పరాయి భాషలను అలవోకగా నేర్చుకోగలరని ప్రపంచ దేశాల అనుభవాలు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సర్వేలు చెప్తున్నాయి అని అన్నారు. తెలుగు ప్రాంతంలో తెలుగు ప్రజలు తెలుగులో చదువుకునే అవకాశాన్ని లేకుండా చేయాలని చూడడం దుర్మార్గమని ఆయన అన్నారు. నేడు విద్యారంగంలో పాలకుల విధానాల ఫలితంగా తెలుగు భాష నిర్వీర్యం అవుతుందని, మాతృభాషలో విద్యా బోధన జరగకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. 

అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు బి. ఎన్ సాగర్ మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలను వేగంగా అమలు చేసే క్రమంలో ఆంగ్ల భాషను పాలకులు ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు అని అన్నారు.  జాతీయోద్యమంలో ప్రజలు విభజించేందుకు బ్రిటిష్ పాలకులు కు వచ్చిన లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని నేటి పాలకులు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయులు నాటి ఆంగ్లభాషను ఉపయోగించుకుని బ్రిటిష్ వారిని తరిమి కొట్టి నట్టుగానే నేటి పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతారని తెలిపారు. ఆంగ్లభాషను బలవంతంగా రుద్దటం కారణంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతిని చరిత్రను కోల్పోతారని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు తమ సంస్కృతిని చరిత్రను కాపాడుకునేందుకు ఉద్యమించాలని ఆయన కోరారు.


సాహితీ స్రవంతి చింతలపూడి నాయకులు సయ్యద్ రసూల్ మాట్లాడుతూ పరాయి భాషను పొగడడం కోసం  తల్లిలాంటి తెలుగు భాష ను అవమానించడం మాతృమూర్తికి ద్రోహం చేసినట్లేనని, తెలుగు భాష హింస అయితే ఆ హింసను భరించడానికి మేము సిద్ధమేనని అన్నారు. 

ఈ కార్యక్రమంలో చింతలపూడి రచయితల సంఘం మరీదు నాగేశ్వరరావు, సాహితీస్రవంతి నాయకులు సింగంశెట్టి సూర్య కుమార్, అశోక్ కుమార్, జనవిజ్ఞాన వేదిక నాయకులు పి పాండురంగారావు, సిఐటియు నాయకులు ఆర్ వి ఎస్ నారాయణ, గురవయ్య కృష్ణ సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ తదితరులు ప్రసంగిస్తూ తెలుగు భాషను కించపరుస్తూ చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే భాషాభిమానులు కవులు రచయితలు ఉపాధ్యాయులు కళాకారులు దీని ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.

Comments