ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను వినియోగించుకోండి
విద్యతోనే సమసమాజం సాధ్యమన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం
మంత్రి బొత్స సత్యనారాయణ
జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించిన మంత్రి బొత్స
జిల్లాలో 9 కెజిబివి పాఠశాలలు జూనియర్ కళాశాల స్థాయికి పెంపు
తొలి కళాశాలను కుమరాం కెజిబివిలో ప్రారంభించిన మంత్రి
తగినంత చెరకు సరఫరా వుంటేనే భీమసింగి షుగర్స్ తెరవడం సాధ్యం
కార్మికులకు వి.ఆర్.ఎస్. ఇచ్చే అంశంపై చర్చిస్తున్నాం : మంత్రి బొత్స వెల్లడి
విజయనగరం, ఫిబ్రవరి 18 (ప్రజా అమరావతి): సమసమాజ స్థాపన జరగాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ భావిస్తున్నారని, అందువల్లే విద్యార్ధులందరికీ సమాన విద్యావకాశాలను కల్పించడం ద్వారా ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్ధి దశ నుంచే వారిలో సమానత్వ భావన ఏర్పరచే లక్ష్యంతోనే ప్రభుత్వం వారికి అనేక వసతులను కల్పిస్తోందని, వాటిని వినియోగించుకొని దేశానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడే పౌరులుగా రూపొందాలన్నారు. జిల్లాలో తొమ్మిది కస్తూరిబా గాంధీ విద్యాలయాలను జూనియర్ కళాశాల స్థాయికి ఉన్నతి కల్పించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. జూనియర్ కళాశాల స్థాయికి పెంపుదల చేసిన కెజిబివిల్లో అదనపు వసతి కల్పించడం జరుగుతుందన్నారు. జామి మండలం కుమరాం కెజిబివిలో రూ.1.60 లక్షల వ్యయంతో జూనియర్ కళాశాల అదనపు వసతికోసం నిర్మించిన భవనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అప్‌గ్రేడ్ చేసిన కెజిబివిల్లో మొదటగా కుమరాంలోనే భవనాలను ప్రారంభించడం జరుగుతోందన్నారు. రెండు నెలల్లో ఇక్కడ జూనియర్ కళాశాల తరగతుల నిర్వహణ కోసం అవసరమైన ఫర్నిచర్, ఇతర వసతులను కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ నిధులు అందుబాటులో లేకపోతే ఎం.పి. నిధుల నుంచి లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు లేదా ఇతర నిధులను వినియోగించి ఈ వసతులు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే, జె.సి.లను ఆదేశించారు. అప్‌గ్రేడ్ చేసిన జూనియర్ కళాశాలల్లో 8 కోర్సులు ప్రవేశపెడుతున్నామని, విద్యార్ధినులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చన్నారు. ఈ జిల్లాలో ఉన్నత విద్యాసంస్థలు తగినంతగా లేవని గుర్తించి జిల్లాలో ఉన్నత విద్యావకాశాల కల్పన కోసం ముఖ్యమంత్రి శ్రీ జగన్ జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను, కురుపాంలో జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశారని మంత్రి పేర్కొన్నారు.
తగినంత చెరకు సరఫరా చేస్తేనే భీమసింగి షుగర్స్ తెరుస్తాం
భీమసింగిలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తెరచి చక్కెర ఉత్పత్తి చేయాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం వున్నప్పటికీ, ఇక్కడ చక్కెర ఉత్పత్తి ప్రారంభించాలంటే కనీసం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును రైతులు సరఫరా చేయాల్సి వుంటుందని, ఆమేరకు హామీ వుంటేనే కర్మాగారాన్నినిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం 30వేల టన్నుల మేరకు మాత్రమే ఈ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు ఉత్పత్తి అవుతోందన్నారు. చెరకు రైతులు నష్టపోకుండా వుండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే వారు పండించిన చెరకును శ్రీకాకుళం జిల్లాలోని సంకిలిలోని ప్రైవేటు చక్కెర కర్మాగారం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. భీమసింగి ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు పండించే రైతాంగం చెరకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. సహకార చక్కెర కర్మాగారంలోని కార్మికులు, సిబ్బందికి ఫ్యాక్టరీ మూత వల్ల ఇబ్బంది కలుగుతోందని, వారికి వి.ఆర్.ఎస్.ప్యాకేజీ ఇచ్చే విషయంపై చర్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం సేకరణకు ఇబ్బందుల్లేవు
జిల్లాలో రైతులు పండించిన ప్రతి కేజీ ధాన్యం గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటివరకు 3.50 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని, మరో 1.50 లక్షల టన్నులు మార్చి నెలాఖరులోగా కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది పంట ఆలస్యంగా రావడం వల్ల ధాన్యం సేకరణ కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యిందన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ బియ్యం ఉత్పత్తి చేయాలంటే రైస్ మిల్లులకు సార్టెక్స్ యంత్రాలు అమర్చుకోవలసి వుంటుందని, జిల్లాలోని రైస్ మిల్లులకు ఈ ఏర్పాటు లేకపోవడం వల్లే ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. దీనిపై అధికారులు, మిల్లర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని మంత్రి చెప్పారు.
సచివాలయ వ్యవస్థపైనే ఆశలు
సచివాలయ సిబ్బంది, వలంటీర్లే ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవుల వంటివారని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా, అవినీతి రహితంగా అర్హులైన వారికి అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా తీసుకువచ్చారని, ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నిజాయితీగా సచివాలయ సిబ్బంది పనిచేసి మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం ద్వారా సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మంత్రి మాట్లాడారు. కొందరు సిబ్బందికి యూనిఫాంలు లేని విషయాన్ని గుర్తించి ప్రశ్నించగా వారికి కూడా త్వరలో అందజేయడం జరుగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ సచివాలయ వసతిపై కూడా మంత్రి ఆరా తీశారు. నూతన భవనం సిద్ధమవుతోందని త్వరలోనే ప్రారంభించే అవకాశం వుందని అధికారులు మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ విద్యార్ధులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా వసతి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా మహిళల విద్యలో వెనుకబడి వుందని కేంద్రం గుర్తించి వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిందన్నారు.
ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆలోచనల్లో వచ్చిన మార్పు కారణంగానే కుమరాంలోని కెజివిబి విద్యాలయంలో చేరేందుకు ఇప్పుడు పోటీ ఏర్పడిందన్నారు. ప్రారంభంలో ఈ కెజిబివిలో చేర్పించేందుకు నిరాకరించేవారని, అటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ సీటుకోసం సిఫారసులు చేయించుకొనే పరిస్థితికి చేరడం గొప్పవిషయమన్నారు. విద్య ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి భావించడం వల్లే నేడు ప్రభుత్వ విద్యాసంస్థలకు మహర్దశ పట్టిందని, విద్యార్ధులంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు పోటీపడుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఈ పాఠశాల ఆదర్శవంతంగా రూపొందుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. రఘువర్మ, జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్, సమగ్రశిక్ష ఏపిసి డా.వి.స్వామినాయుడు, డి.ఇ.ఓ. బ్రహ్మాజీ రావు, మండల ప్రత్యేక అధికారి విజయకుమార్, ఎంపిపి ఎస్.అరుణ, జెడ్పీటీసీ గొర్లె సరయూ, సర్పంచ్ పిన్నింటి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment