ఆడపిల్లకు అండగా ప్రభుత్వ రక్షణవ్యవస్థ - 'దిశ' యాప్ సమగ్రప్రణాళికగా గుర్తెరగాలి

 

ఆడపిల్లకు అండగా ప్రభుత్వ రక్షణవ్యవస్థ

- 'దిశ' యాప్ సమగ్రప్రణాళికగా గుర్తెరగాలి


- వినుకొండ పర్యటనలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పిలుపు

- ప్రేమోన్మాది బాధితురాలు శ్రావణి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ


వినుకొండ(గుంటూరు జిల్లా) (ప్రజా అమరావతి):

అమ్మాయిలు ఆత్మహత్యలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ రక్షణవ్యవస్థ అండను గుర్తెరగాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. వేధింపులు, అన్యాయానికి గురైనప్పుడు'దిశ' యాప్ ఒక సమగ్రప్రణాళికగా పనిచేస్తుందన్నారు. రక్షణతో పాటు జీవిత భద్రతకు 'దిశ' భరోసానిస్తుందన్నారు. 

గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం లో శానంపూడి గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది బాధితురాలు శ్రావణి కుటుంబాన్ని బుధవారం వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. లోతైన పోలీసు విచారణతో నేరస్తులపై కఠిన చర్యలు చేపడతామని బాధితురాలి కుటుంబానికి హామినిచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రేమ, పెళ్లి పేరిట ఆడపిల్లలను వేధించే నీచమైన సంస్కృతిని ఖండించాలన్నారు. కొందరు మూర్ఖులు ప్రేమించాననగానే ఆడపిల్ల తనకిష్టం లేకున్నా తలొంచాల్సిన అవసరం లేదని.. పెళ్లి విషయంలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. గ్రామాల్లో యువత చెడుదారితో నడుస్తున్నప్పుడు ఊరి పెద్దలు సైతం జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. ఏదైనా సంఘటన, వేధించడం జరిగినప్పుడు సమీప పోలీసు స్టేషనులో ఫిర్యాదునివ్వాలన్నారు. అంగన్ వాడీ, మహిళాపోలీసు, వాలంటీర్ వ్యవస్థను ఆసరాగా తీసుకుని ఆడపిల్లలు తమ బాధలను చెప్పుకుని రక్షణపొందాలని సూచించారు. 

దిశ యాప్ వినియోగం, అమలుపై విస్తృతంగా ఇంటింటికీ అవగాహన చేయాలని మహిళా పోలీసులతో మాట్లాడి పలు సూచనలిచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి కుటుంబం, గ్రామపరిస్థితులపై ఐసీడీసీ సీడీపీవో, వినుకొండ రూరల్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ రాజ్యలక్ష్మి వివరించారు. వేధింపులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. 

Comments