దళారీ వ్యవస్థను నియంత్రిస్తూ మత్స్యకారులకు పూర్తి లబ్దిని చేకూర్చేందుకే చర్యలు


జి.ఓ.ఆర్టి.నెం217 పై జరుగుచున్న దుప్రచారాన్ని నమ్మవద్దు

దళారీ వ్యవస్థను నియంత్రిస్తూ మత్స్యకారులకు పూర్తి లబ్దిని చేకూర్చేందుకే చర్యలు

27,363  చెరువుల్లో వంద హెక్టార్లకు పైబడిన 582 చెరువులకు ఈ జి.ఓ. వర్తింపు 

ఇందులో 337 చెరువులు మాత్రమే 255 మత్సకార సంఘాలకు లీజుకు ఇవ్వబడ్డాయి

నెల్లూరులో పైలట్ ప్రాజక్టు ఫలితాలను బట్టి ఇతర జిల్లాల విస్తరణకు తదుపరి నిర్ణయం

ఇదే విషయాన్ని జి.ఓ.ఆర్టి.నెం.301 లో స్పష్టపరుస్తూ ప్రస్తుత పద్దతిలోనే లీజు హక్కులు 

గతంతో పోల్చితే ప్రస్తుతం మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్దికి విస్తృత కార్యక్రమాలు

రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు 

అమరావతి,ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి)


:  దేశీయ మత్స్యకారుల సంక్షేమాన్ని, అభ్యున్నతిని  కాంక్షిస్తూ వారి జీవనోపాధిని విస్తృత పర్చాలనే లక్ష్యంతో  ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఆర్టి.నెం.217 పై పలు వర్గాలు చేస్తున్న దుప్రచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు విజ్ఞప్తిచేశారు. మంగళవారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జి.ఓ.ఆర్టి.నెం.217 అమలు వల్ల మత్సకారులకు చేకూరే లబ్ది మరియు ప్రస్తుత ప్రభుత్వం మత్సకారుల సంక్షేమానికి, అభివృద్దికి అమలు పరుస్తున్న పలు పథకాలను వివరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర  పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ది శాఖ మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ జి.ఓ.ఆర్టి.నెం.217 పై ఎంతో స్పష్టతను ఇస్తూ ఇప్పటికే పలు దఫాలుగా మాట్లాడం జరిగిందన్నారు. అదే విధంగా మత్స్యకార సంఘాల  ప్రతినిధులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి  ఈ జి.ఓ. విషయంలో వారిలో నెలకొన్న పలు సందేహాలను, అపోహలను నివృత్తి పర్చడం జరిగిందన్నారు.  అయినప్పటికీ పలు వర్గాలు ఈ జి.ఓ.పై చేస్తున్న దుప్రచారాన్ని ఖండించేందుకు మరియు ఈ జి.ఓ. వల్ల మత్స్యకారులకు ఒనగూరే లబ్దిని వివరించేందుకే  మీడియా ముందుగు వచ్చిన్లటు ఆయన తెలిపారు.

  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27 వేల 363 చెరువులు ఉండగా వాటిలో మత్స్యశాఖ పరిధిలో 3,325 మైనర్ ఇరిగేషన్  చెరువులు, 118 రిజర్వాయర్లు మరియు పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో  23,920 చెరువుల ఉన్నాయన్నారు.  అయితే మైనర్ ఇరిగేషన్  చెరువులలో ఉన్న మత్స్య సంపద దళారీల చేతిలో ఉండటం వల్ల మత్స్య సహకార సంఘాల సభ్యులకు రావలసిని పూర్తి ఆదాయాన్ని పొందలేకపోతున్న విషయాన్ని ప్రభుత్వ గుర్తించి దన్నారు.  ఈ దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు మరియు  వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడిన చెరువుల్లోని మత్స్య సంపదను బహిరంగ వేలం  వేసి తద్వారా మత్స్య సహకార సంఘ సభ్యులకు పూర్తి లబ్దిని చేకూర్చాలనే లక్ష్యంతోనే  ప్రభుత్వం ఈ జి.ఓ. ఆర్టి నెం.217 ను జారీ చేయడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో నున్న మొత్తం 27,363  చెరువుల్లో వంద హెక్టార్ల విస్తీర్ణానికి పైబడి ఉన్న 582 చెరువులు మాత్రమే  ఈ జి.ఓ. పరిధిలోకి వస్తాయన్నారు. అందులో కూడా 337 చెరువులు మాత్రమే 255 మత్సకార సంఘాలకు లీజుకు ఇవ్వబడ్డాయని ఆయన తెలిపారు.  అయితే ప్రప్రధమంగా పైలెట్ ప్రాతిపదికన  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 27 చెరువుల విషయంలో మాత్రమే ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సంబందిత వర్గాలతో చర్చించిన పిదప  మాత్రమే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరింపచేసేందుకు నిర్ణయంతీసుకోవడం జరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది నవంబరు 16 న జారీచేసిన జి.ఓ.ఆర్టి.నెం.301 లో స్పష్టపరుస్తూ ప్రస్తుతం అమల్లోనున్న  పద్దతిలోనే  మత్స్య సహకార సంఘాలకు లీజు పై చేపలు పెంచుకొనే హక్కులను కల్పించడం జరిగిందన్నారు. అందువల్ల ఈ జి.ఓ. విషయంలో జరుగుచున్న అసత్య ప్రచారాలను మత్స్యకారులు ఎవరూ నమ్మవద్దని, ఎటు వంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన విజ్ఞప్తిచేశారు. 

మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్దికి పలు పథకాలు.....

గతంతో  పోల్చితే ప్రస్తుతం మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్దికి విస్తృత కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వాటిలో ముఖ్యంగా నవరత్నాలు పథకాలు అమల్లో భాగంగా  వైఎస్సార్ మత్స్యకార భరో పథకం క్రింద మూడు సంక్షేమ పథకాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు. వీటిలో ముఖ్యంగా వేట నిషేద కాలానికి సంబందించిన భృతిని  రూ.4 వేల నుండి రూ.10 వేలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని,  సాంప్రదాయ పడవల యజమానులకు మరియు సిబ్బందికి వేట నిషేధకాల భృతిని వర్తింపచేసిందన్నారు. ఈ పథకం క్రింద గత మూడేళ్లలో రూ.309.33 కోట్లు వెచ్చించి తద్వారా 1,09,231 మత్స్యకార కుటుంబాలకు లబ్దిచేకూర్చడం జరిగిందన్నారు. మత్స్యకారుల పడవలకు హెచ్.ఎస్.డి. ఆయిల్ పై సబ్సిడీని గతంలోనున్న రూ.6.03 ల నుండి రూ.9.00 లకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిందన్నారు.  మోటరైజ్డు  బోట్లకు  నెలకు  300 లీటర్లు మరియు  మెకనైజ్డు బోట్లకు నెలకు  3 వేల  లీటర్లు హెచ్.ఎస్.డి. ఆయిల్  సబ్సిడీని స్మార్టు కార్డుల ద్వారా ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీగా పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం క్రింద ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.41 కోట్లకు పైబడి వెచ్చించడం జరిగిందన్నారు. అదే విధంగా చేపల వేటలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు  ఇచ్చే ఎక్స్ గ్రేషయాను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచి, ఇప్పటి వరకూ  64 బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను చెల్లించడం జరిగిందన్నారు. 

తీరప్రాంత మత్స్యకారుల వలసలను నివారించేందుకు రూ.3,177 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, వీటిలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రగతిలో ఉండగా మిగిలినవి టెండర్ దశలో ఉన్నాయని, వీటి నిర్మాణాలు కూడా  వచ్చే ఏడాది నాటికి ప్రారంబించనున్నట్లు ఆయన తెలిపారు.  వీటి ద్వారా 76 వేల 230 మందికి ప్రత్యక ఉపాధి మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా 35 వేల మంది  పరోక్ష ఉపాధి కలుగనున్నట్లు ఆయన తెలిపారు. 

 అదే విధంగా రూ.86.95 కోట్లతో  శ్రీకాకుళం జిల్లా మంచినీలపేట, విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేట తదితం ప్రాంతాల్లో నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. మంచినీలపేట ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి  అయ్యే దశకు చేరుకుందని, మిగిలిన మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల డి.పి.ఆర్.లను సిద్దం చేయడం జరిగిందన్నారు.  340 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో మౌలిక సదుపాయాల పునరుద్దరణకు MGNREGS నిధులు రూ.90.44 కోట్లు ప్రతిపాదనలకు  ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. హబ్ అండ్ స్పొక్ మోడల్ ద్వారా  దేశీయ మత్స్య మార్కెటింగ్ విధానాన్ని  ప్రోత్సహించేందుకు 70 ఆక్వా హబ్స్ మరియు వాటికి అనుసంధానించి 14 వేల రిటైల్ అవుట్ లెట్స్ ను  రాష్ట్రంలో  ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 శాతం చేపల వినియోగాన్ని 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments