*టిడిపి శ్రేణులకు ఏడాదిపాటు బ్రహ్మోత్సవమే*
*గండిపేట కేంద్రంగా మహానాడు*
*ఎన్టీఆర్ శతజయంతి, పార్టీ నాలుగుదశాబ్దాల ఆవిర్భావ వేడుకలకు సమాయత్తం*
*ఒకేవేదికపై కనువిందు చేయనున్న నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు*
*గుంటూరు (ప్రజా అమరావతి): దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కి వున్న తరుణంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం పైనే అధినేత చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 2019లో గతంలో ఎన్నడూ లేనంత దయనీయ స్థితిలోకి దిగజారిన తెలుగుదేశం పార్టీకి పునః ప్రాభవ వైభవాలను సమకూర్చటమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో తెఊగుదేశం పార్టీని బలోపేతం చేయటాన్ని చంద్రబాబు ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది ఎంతో కీలకమైనది. ఈ ఏడాది మే నెలలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి జరుగనున్నది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి నాలుగు దశాబ్దాలు పూర్తి కానున్నది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఈ ఏడాది మే 28 వ తేదీనుంచి సంవత్సరకాలం పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.*
ఎన్టీఆర్ శతజయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ద్వారా ప్రతి పల్లెలోనూ పార్టీ పతాకం రెపరెపలాడించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందుకు సంబందించిన తుది కార్యాచరణ ఈ సంవత్సరం మే నెలలో జరుగనున్న పార్టీ మహానాడులో రూపుదిద్దుకోనున్నది. పార్టీ మహానాడు వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీకి కొత్త రూపు ఇచ్చే పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నం అయ్యారు. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా నాలుగుగోడలకే పరిమితం చేసిన మహానాడును ఈ ఏడాది భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. పార్టీ పురుడుపోసుకున్న తెలంగాణలోని గండిపేట వద్దనే ఈ ఏడాది మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు వినిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయటం, కొత్త రక్తాన్ని నింపటం, ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన కార్యాచరణ, జాఈయ, రాష్ట్ర రాజాకీయాలలో నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై మహానాడు వేదికగా స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఆ దిశగా ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభం అయింది.
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం సమకూర్చే క్రమంలో భాగంగా ముందుగా నందమూరి కుటుంబసభ్యులు అందరినీ ఒకే వేదికమీదకు తీసుకువచ్చేందుకు కృషి జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ కు స్వయానా అల్లుళ్ళైన డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడులు పార్టీ కి రెండు కళ్లుగా వున్నారు. అనంతర పరిణామాలలో వివిధ రకాలైన కారణాలతో డాక్టర్ద గ్గుబాటి కుటుంబం పార్టీకి దూరమయింది. ఎన్టీఆర్ కుమార్తె, డాక్టర్ దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకొని పార్లమెంట్ సభ్యురాలిగా రెండు పర్యాయాలు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం పురంధేశ్వరి బిజెపి లో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో జాతీయ స్థాయి నాయకురాలిగా గుర్తింపు పొందారు. అయితే ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి అనూహ్యంగా వైఎస్సార్సీపిలో చెరీ తొలిసారి ఓటమి చవిచూశారు. అనంతరం తన కుమారుడుడైన హితేష్ ను రాజకీయ ఆరంగేట్రం చేయించాలని ప్రయత్నాలు జరుపుతున్నారు.
ప్రస్తుతం వైఎస్సార్సీపి కి దూరంగా వుంటున్న డాక్టర్ దగ్గుబాటి ని తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే గా వున్న నందమూరి బాలకృష్ణ రెండు కుటుంబాల మధ్య సయోధ్యకోసం కృషి చేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలలో అందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఎన్టీఆర్ మనుమడు, ప్రముఖ సినీ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇకనుంచి తెలుగుదేశం రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆ పార్టీ వర్గాలలలో చర్చ జరుగుతున్నది. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో వీరందరూ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు తీవ్రప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. బిజెపిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పురంధేశ్వరి విషయంలోనే సందిగ్ధత కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు పలుమార్లు దిశానిర్దేశం చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత తరుణంలో రాష్ట్రంపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలముందు జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే కూటములలో భాగస్వామ్యం వహించకుండా అన్నింటికీ సమదూరంలో వుండాలని, ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనేది తెలుగుదేశం భావనగా వున్నట్టు అవగతం అవుతున్నది. ఇందుకు సంబందించి ఈ ఏడాది మే నెలలో జరుగనున్న పార్టీ మహానాడులో ఒక స్పష్టత రాగలదని భావిస్తున్నారు. ఆందుకు అనుగుణంగా రాజకీయ తీర్మానాలు రూపొందించెందుకు ఆ పార్టీ యంత్రాంగం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. మహానాడు లోగానే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంశాలవారీగా కార్యాచరణ రూపొందించాలని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. మొత్తం మీద ఎన్టీఆర్ శతజయంతి, పార్టీ నాలుగుదశాబ్దాల ఆవిర్భావ వేడుకలను ఒక బ్రహ్మొత్సవం లా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు సమాయత్తం అవుతున్న వాతావరణం కన్పిస్తోంది. వారి ప్రయత్నాలు ఏ స్థాయిలో విజయవంతం అవుతాయో వేచిచూడాల్సిందే.
addComments
Post a Comment