పొందూరు ఖాదీకి జి.ఐ.ట్యాగ్ జారీచేయాలి
లోక్‌సభలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ విజ్ఞప్తి
విజయనగరం, మార్చి 14 (ప్రజా అమరావతి):
శ్రీకాకుళం జిల్లా పొందూరులో తయారు చేస్తున్న ఖాదీ ఉత్పత్తులకు భౌగోళిక సూచీ(జియోగ్రాఫికల్ ఇండికేషన్-జిఐ) ట్యాగ్ జారీ చేయాలని విజయనగరం లోక్‌సభ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పొందూరు ఖాదీకి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తగిన ప్రాముఖ్యత పొందేందుకు ఖాదీ వస్త్రాల మార్కెటింగ్‌కు, చట్టపరమైన రక్షణ అందించేందుకు, తద్వారా ఎగుమతులు పెంచేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ సోమవారం లోక్‌సభలో అత్యవసర ప్రస్తావన కింద ఈ అంశంపై మాట్లాడుతూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల పొందూరు సందర్శించి ఇక్కడి ఖాదీ వస్త్రాలపై సంతృప్తి వ్యక్తంచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ పొందూరులోని ఖాదీ కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా భౌగోళిక గుర్తింపు సూచీ జారీచేయాలని కోరారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పొందూరు ఖాదీకి ప్రత్యేక గుర్తింపు వుందన్నారు. కొన్ని దశాబ్దాలుగా అనేక చేనేత కుటుంబాలు ఖాదీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన పొందూరు ఖాదీని జి.ఐ.ట్యాగ్ జారీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
addComments
Post a Comment