వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వెంటనే చలివేంద్రాలను ఏర్పాటు చేయండి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, మార్చి 14 (ప్రజా అమరావతి) ః
వేసవి తీవ్రత పెరుగుతున్న కారణంగా, వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా వేసవి తాపాన్ని తగ్గించే చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసి, మజ్జిగ, త్రాగునీరు అందుబాటులో ఉంచాలనిని సూచించారు. బస్‌స్టాపులు, మార్కెట్లు, జన సమ్మర్థ ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఉపాధి వేతన దారుల పనివేళలను సవరించి, ఎండ తీవ్రత లేని వేళల్లో పనులు నిర్వహించాలన్నారు. ఉపాధి వేతన దారులకు నీడ, త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ప్రతీ కార్యాలయం వద్దా త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. జగనన్న కాలనీల్లో త్రాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఎండవేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిల్లో వచ్చే పక్షంలో, వేడినుంచి రక్షణకు టోపీలు, గొడులు లాంటి పరికరాలను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా వృద్దుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రతీరోజూ ఎండ తీవ్రత గురించి ఆయా మండలాల వారీగా వాతావరణ శాఖ వివరాలతో హెచ్చరికలు జారీ చేయాలన్నారు. వాతావరణ వివరాలను తెలియజేస్తూ, ముఖ్యమైన కూడళ్లవద్దా, కార్యాలయాల వద్దా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రమాదవశాత్తూ ఎవరైనా వడదెబ్బకు గురి అయితే, వారికి తక్షణ చికిత్స నందించేందుకు అవసరమైన మందులను అన్ని ఆసుపత్రుల్లో సిద్దంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. వేసవిలో వ్యాప్తిచెందే వ్యాధుల చికిత్సకు సంబంధించిన మందులు, పరికరాలను సిద్దం చేయాలన్నారు. వడదెబ్బకు చికిత్సనందించేందుకు ప్రతీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సా విభాగాలను సిద్దం చేయాలన్నారు. 104, 108 వాహనాలను, సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. వడదెబ్బకు గురైన వారి వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని, దీనిపై విస్తృతంగా అవగాహానా కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పనికి విరామం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
addComments
Post a Comment