ప్రభుత్వ చొరవతో ఉక్రెయిన్ నుంచి చేరుకున్న ఏడుగురు విద్యార్ధులు
ఈరోజు రాత్రికి చేరుకోనున్న మరో విద్యార్ధి
మిగిలిన వారినీ రప్పించేందుకు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడి
విజయనగరం, మార్చి 05 (ప్రజా అమరావతి) :ఉక్రెయిన్ నుంచి మన దేశానికి చెందిన విద్యార్ధులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా మన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్ధులు నేటివరకు జిల్లాకు చేరుకున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు. జిల్లాకు చెందిన మొత్తం 11 మంది విద్యార్ధులు ఉక్రెయిన్‌లో చదువుతున్నట్టు సమాచారం వుందన్నారు. న్యూఢిల్లీకి చేరుకున్న విద్యార్ధులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసి జిల్లాకు రప్పించడం జరిగిందన్నారు. బొబ్బిలికి చెందిన నిఖిల్ కుమార్ అనే విద్యార్ధి యుద్ధ పరిస్థితులు మొదలవడానికి ముందే ఫిబ్రవరి 7న చేరుకున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న సాలూరుకు చెందిన విద్యార్ధిని కోట నాగలక్ష్మీ చరిత జిల్లాకు చేరారని, మార్చి 3వ తేదీన బొబ్బిలికి చెందిన ఎస్.బి.ఎస్.జశ్వంత్ అనే విద్యార్ధి, మార్చి 4వ తేదీన పురుషోత్తం మైత్రేయి, నిష్టల హరితేజ, తోట సాయివంశీ, సరిడి జితేంద్రకుమార్ తదితర నలుగురు విద్యార్ధులు జిల్లాకు చేరారని పేర్కొన్నారు. పార్వతీపురంకు చెందిన సత్తి మౌనిక ఈరోజు రాత్రికి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నట్టు వెల్లడించారు.
మిగిలిన విద్యార్ధులను కూడా జిల్లాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఈ మేరకు ఉక్రెయిన్‌లోని భారత విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఆయా విద్యార్ధుల క్షేమ సమాచారాన్ని తహశీల్దార్‌లు ఆయా విద్యార్ధుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.
ఆనంది శ్రేయ, యశ్వంత్ కుమార్ పంచారియ, పాలూరి మౌనిక, పోతుపురెడ్డి పుష్కరణి, శశి కుమార్ అభిజిత్ అనే మరో ఐదు గురు విద్యార్ధులు కూడా హంగేరి లోని బుడాపెస్ట్ కు చేరుకున్నారని వారిని కూడా మరి కొన్ని రోజుల్లో వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు
addComments
Post a Comment