రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు'

 *'రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు'* *టీడీపీ అధినేత చంద్రబాబు*

హనుమాన్ జంక్షన్ (ప్రజా అమరావతి);

మిరపకు తెగులొచ్చి రూ.5వేల కోట్లు రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. వర్షాకాలంలోనే విద్యుత్ కోతలు ఉంటే ఇక వేసవి పరిస్థితి ఏంటని నిలదీశారు.


అప్పుల కోసం కక్కుర్తిపడి.. వ్యవసాయ మోటర్లకు మీటర్ల పేరుతో రైతులకు జగన్ రెడ్డి ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని వారు మీటర్ల బిల్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. రైతులు చేసే ప్రతీపోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


*బాబు రావాలి.. రైతు గెలవాలి*


కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో 'రైతు గెలవాలి – వ్యవసాయం నిలవాలి' అంశంపై తెలుగు రైతు ఆధ్వర్యంలో 3రోజుల రాష్ట్రస్థాయి కార్యశాల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యకర్తలు గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. తెలుగు రైతులు చంద్రబాబుని ఎడ్లబండిపై ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు.


రైతు గెలవాలంటే చంద్రబాబు రావాలంటూ నినాదాలు చేశారు. ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి దాదాపు రూ.10వేల కోట్లపైగా ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ఒక్క ఏకరాకూడా ఎండలేదని.. రైతులు నష్టపోకుండా విద్యుత్ సంస్కరణలకు తెదేపా శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

Comments