రోటరీ క్లబ్ వొకేషనల్ మంత్ ముగింపు వేడుకలు

 

రోటరీ క్లబ్ వొకేషనల్ మంత్ ముగింపు వేడుకలు


రోటరీ వొకేషనల్ మంత్ విశిష్ట పురస్కారాన్ని అందుకున్న గౌరవ జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాధ్ రాయ్

రోటరీ సేవలను గిరిజన ప్రాంతాల అభివృద్దికి కూడా విస్తరించాలి

జస్టిస్ సి. హెచ్. మానవేంద్రనాధ్ రాయ్

విజయనగరం మార్చి, 20:(ప్రజా అమరావతి): రోటరీ క్లబ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సేవా దృక్పదంతో చేస్తున్న సేవలు అభినందనీయమని, దీనిని మరింత విస్తృత పరచి ప్రజలకు మరింత చేరువగా వుండాలని ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి గౌ.జస్టిస్ సి హెచ్ మానవేంద్ర నాథ్ రాయ్ పిలుపు నిచ్చారు.  విజయనగరం జిల్లా రోటరీ క్లబ్ వొకేషనల్ మంత్ ఎక్స్లెన్స్ విశిష్ట అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం స్థానిక ఎస్.వి.యన్ లేక్  పాలస్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొని  రోటరీ వొకేషనల్ మంత్ విశిష్ఠ పురస్కారాన్ని హై కోర్టు న్యాయమూర్తి గౌ.జస్టిస్ సి.హెచ్. మానవేంద్ర నాథ్ రాయ్ అందుకున్నారు. 

      రోటరీ క్లబ్ నెల రోజులపాటు నిర్వహించిన వొకేషనల్ మంత్ ముగింపు వేడుకల్లో భాగంగా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా జస్టిస్ మాట్లాడుతూ సర్విస్ ఆర్గనైజేషన్ ఎంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయతతో సేవలను అందిస్తున్నారని, ప్రతీ ఒక్కరికి అభినందిస్తున్నానన్నారు.  న్యాయవాద వృత్తి అనేది  నోబుల్ ప్రొఫెషన్ వంటిదని, మెడికల్, లీగల్, క్లెడ్జిమన్ వృత్తులు ముఖ్యమైనవని, బాధలలో, కష్టాలలో వున్నవారు వారి బాధల నివృత్తికోసం వారి వద్దకు వెళతారని, వారికి సరైన సేవలు అందించి బాధల నుండి విముక్తి కలిగించాలన్నారు. రొటేరియన్లు కూడా నోబుల్ వృత్తిలో భాగమని భావిస్తున్నానన్నారు.  ప్రతీ ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా అంకిత భావం, తపన, బాధ్యతతో ఉత్సాహంగా సేవలను అందిస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో తమ జీవితాలను కూడా లెక్కచేయకుండా నిస్వార్థకంగా సేవలు అందించారని, తన స్వార్థాన్ని కూడా విడనాడి సంఘ సంస్కర్తలుగా సమాజ సేవ చేస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారన్నారు.  ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని,  ఇక్కడ నుండే ఎక్కువ 70 శాతం మంది జ్యూడిషియరీ, న్యాయవాదులు, ఉన్నతస్థానాలలో వున్నారన్నారు.  జిల్లాలో పార్వతీపురం వెనుకబడిన ప్రాంతమని, అధిక సంఖ్యలో గిరిజనులు వున్నారని, గిరిజన ప్రాంత అభివృద్దికి రోటేరియన్లు సేవలు అందించాలని కోరారు.  స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినప్పటికి మన దేశం ఇంకా అభివృద్ది దశలోనే వున్నదని, సరైన అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత కొనసాగుతూనే వున్నదని, దేశంలో వున్న రుగ్మతలను నిర్మూలించడానికి ఇటు వంటి మంచి ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి సేవలను పెంచాలన్నారు.  పిల్లల యాచక వృత్తి (ఛైల్డ్ బెగ్గింగ్) నియంత్రించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.  పోలీస్, జ్యూడీషియరీలతో కమిటీగా ఏర్పడి పూర్తిసాయిలో నివారించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. 

ప్రభుత్వ, ప్రవేట్ ఆర్గనైజేషన్ లలో విలువలను పాటిస్తూ సేవలు అందిస్తున్న ఉద్యోగులను గుర్తించి అవార్డులను అందించడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఈ సంవత్సరం నేను అవార్డు పురస్కారం అందుకుంటున్నందుకు చాలా గర్వంగా వున్నదని, మరింత బాధ్యతను, పట్టుదలను పెంచిందని, సమాజంలో అన్నిరంగాలలో నిస్వార్థమైన న్యాయ వ్యవస్థ విలువలను పెంచుతానని తెలియజేసున్నాన్నారు. 

        ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటేరియన్ ఎం.రామారావు పాల్గొని రోటరీ సంస్థ వివిధ రంగాల్లో చేస్తున్న సేవలపై  వివరించారు.  

        ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి  గౌ. జస్టిస్ సి హెచ్ మానవేంద్ర నాథ్ రాయ్ ను రోటరీ సెంట్రల్ క్లబ్ సభ్యులు గజమాలతో సత్కరించి, ఘన సన్మానం గావించి, రోటరీ వొకేషనల్ మంత్ విశిష్ఠ పురస్కారాన్ని అందించారు. అనంతరం విజయనగరం బార్ అసోసియేషన్ మరియు జ్యూడిషియరి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఘన సన్మానం చేశారు.

      జిల్లాలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్స్లెన్సు అవార్డులను అందించారు.  

     ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన జడ్జిలు, న్యాయవాదులు, రొటేరియన్లు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్  రోటేరియన్ కిషోర్ కుమార్ జైన్, జిల్లా ప్రెసిడెంట్ వి.ఎస్.కిరణ్ కుమార్, ఇతర సభ్యులు చందు బత్తుల, జగదీష్, నాగేశ్వర రావు, శివకుమార్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments