జాతీయ మహిళా పార్లమెంట్' నేడే..

 


'జాతీయ మహిళా పార్లమెంట్' నేడే..

- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదిక సిద్ధం

- హాజరుకానున్న మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు


అమరావతి (ప్రజా అమరావతి):

మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు జాతీయ మహిళా కమిషన్ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ' జాతీయ మహిళా పార్లమెంట్' శుక్రవారం జరగనుంది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా మహిళా పార్లమెంట్ నమూనాను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి , మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, హోం, విపత్తుల శాఖ మంత్రి మేకతోటి సుచరిత,

కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు విడదల రజిని, ఉండవల్లి శ్రీదేవి, ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు పోతుల సునీత, టి.కల్పలతతో పాటు వివిధ ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏఎన్ యూ వీసీ పి. రాజశేఖర్ పాల్గొనున్నారు. అనంతరం మాక్ మహిళా పార్లమెంట్ జరగనుంది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్లమెంట్ స్పీకర్ గా వ్యహరించనుండగా... కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, కర్రి జయశ్రీ, బూసి వినీత, షేక్ రుకియాబేగం, గడ్డం ఉమ లు మంత్రులుగా ఉంటారు. వివిధ ఎన్జీవోలు, యూనివర్సిటీ, కళాశాలల నుంచి అధ్యాపక, విద్యార్థులు పార్లమెంటు సభ్యుల పాత్ర పోషిస్తారు. ప్రశ్నోత్తరాలు, వివిధ బిల్లులపై తీర్మానాలు చేయనున్నారు. 

దాదాపు 500 మంది మహిళలు, యువతులు పాల్గొనే జాతీయ మహిళా పార్లమెంట్ 2022 రాష్ట్రవ్యాప్త ప్రాధాన్యతను సంతరించుకుంది. 


 చర్చించే ప్రధాన అంశాలివే..

1. ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడం - గృహహింస చట్టం, 125 సీఆర్.పీసీ, పోష్ చట్టం, వివాహ ఆర్డర్ అమలులో వయస్సు పెంపు, దిశ బిల్లు తదితర చట్టాలకు సంబంధించి సిఫార్సు చేసిన అవకాశాలతో లోపాలను పూరించడంపై చర్చించనున్నారు.


2. మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించడానికి మహిళల ఆర్థిక సాధికారత అంశంపై ప్రధానంగా ఫోకస్ తో చర్చ జరగనుంది. 


3. లింగ సాధికారత - అన్ని పాఠ్యాంశాల్లో లింగ సున్నితత్వం/ సమానత్వంతో కూడిన కొత్త విద్యా విధానంపై ఆసక్తికర చర్చ చేయనున్నారు.


4. మహిళలు, బాలికల భద్రత - దిశ యాప్. సైబర్ క్రైమ్ జోక్యం, పోస్కో కోసం అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అక్రమ రవాణా మరియు ఇతర చర్యలపై పరిశీలనాత్మకంగా చర్చిస్తారు.


5. మహిళల ఆరోగ్యం & శ్రేయస్సు అనేది చివరి ప్రధానాంశంగా చర్చించి ఆయా అజెండాలపై ఫోరమ్ నుండి చర్చ తర్వాత అంశాలవారీగా తీర్మానాలను రూపొందించేందుకు ఐదు మంది సభ్యులతో ఒక కమిటీని నియమించనున్నారు. వీటన్నిటి తీర్మానాలను నివేదికలుగా రాష్ట్ర మహిళా కమిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో పెట్టనున్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ అనేది కొత్తగా చొరవ చేయాల్సిన ఆవశ్యకతపై దృష్టి సారించేందుకు.. ఇప్పటికే ఉన్న అవకాశాలతో లోపాలను సవరించడం, బాధితులకు సత్వర న్యాయం మరియు నేరస్తులకు శిక్షలు అవసరం మాక్ పార్లమెంట్ తెలియజేస్తుంది. అదేవిధంగా మహిళలు,యువతులో మరింత అవగాహన, ప్రేరణ పొందేందుకు మహిళా పార్లమెంట్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోంది. పార్లమెంటరీ విధానాల పరిచయంతో పాటు, వారు రాజకీయ ప్రక్రియలలో పాల్గొనడానికి ప్రోత్సహమిచ్చినట్లవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థ, పోలీసు,మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, రవాణా, సమాచార మరియు ప్రజా సంబంధాలు,  మెప్మా, సెర్ప్, పలు ఉన్నత పాఠశాలల నుండి మహిళలు, యువతులు & విద్యార్థుల భద్రతకు పనిచేస్తున్న ఎన్జీవోలు , కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు భారీగా పాల్గొనున్నారు.Comments