వంటి నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి: సిఎస్



వంటి నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి: సిఎస్



అమరావతి,11 మార్చి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వంటనూనెల ధరలు నియంత్రణకు వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పౌరసరఫరాలు,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు.ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ వంట నూనెల ధరల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట నూనెల ధరలు పెరుగుదల నియంత్రణకు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు పౌరసరఫరాలు,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో హోల్ సేల్ డీలర్లుతో సమావేశం నిర్వహించి తగిన మొత్తం వంట నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉండి నిర్దేశిత ధరలకు విక్రయించేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.రైతు బజారులో సరిపడిన మొత్తం వంటనూనె ల స్టాకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.


అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా వంటనూనెల తయారీదారులతో వెంటనే సమావేశం నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ మరియు ఇఓ కార్యదర్శి గిరిజా శంకర్ ను ఆదేశించారు.


వంట నూనెల ధరలు పెరుగుదల నియంత్రణకు వెంటనే రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ,సహకార శాఖ ముఖ్య కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, డిజి.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు కొలతల శాఖ కంట్రోలర్, కమీషనర్ వ్యవసాయ మార్కెటింగ్, కమీషనర్ హెల్తు,విసి అండ్ ఎండి ఆయిల్ బెడ్,విసి అండ్ ఎండి సివిల్ సప్లయిస్ తదితర అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి రోజువారీ ధరలు నియంత్రణను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పౌరసరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్ ను ఆదేశించారు.


జిల్లా స్థాయిలో కూడా జెసి,సివిల్ సప్లయిస్, తూనికలు కొలతలు తదితర శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు, ముమ్మరం చేసి స్టాకు నిల్వలను తనిఖీ చేయాలని అక్రమాలకు పాల్పడే వారిపై 6-ఏ కేసులు నమోదు చేయాలని సిఎస్ ఆదేశించారు.


ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ మరియు ఇఓ కార్యదర్శి గిరిజా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించి వంట నూనెల అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు.


ఈసమావేశంలో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ కెఆర్ఎం కిశోర్ కుమార్, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీరపాండ్యన్, ఆయిల్ ఫెడ్ ఎండి రవి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.



Comments