గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సులబ్ కాంప్లెక్స్ ల వద్ద డ్యూటీలు వేయడం విచారకరం



*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సులబ్ కాంప్లెక్స్ ల వద్ద డ్యూటీలు వేయడం విచారకరం


*

గుంటూరు (ప్రజా అమరావతి);

*సులబ్ కాంప్లెక్స్ ల వద్ద రుసుము వసూలు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు షిఫ్ట్ లు వారీగా డ్యూటీలు వేయటం తీవ్ర అభ్యంతరకరం*


*మరుగుదొడ్ల వద్ద విధులు నిర్వహించడానికి పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు డాక్టరేట్లు అవసరమా?:గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా*


రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఆశయానికి,రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులపై చిన్న చూపు చూస్తూ,ఉద్యోగులను కించపరిచే విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్న తీరుతో వ్యవస్థకు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.


 ఫిబ్రవరి 28వ తేదీన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లను మరుగుదొడ్ల వద్ద రుసుము వసూలు చేసేందుకు షిఫ్టు ల వారీగా మూడు షిఫ్టు లలో 24గంటల పాటు విధులు అప్పగించడం జరిగింది, అలాగే వీరిలో మహిళా అడ్మిన్ సెక్రెటరీ సైతం రాత్రి పది గంటల వరకు వెదురు నిర్వహించవలసినదిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అయితే, ఈ రకంగా సచివాలయ ఉద్యోగులను  ఇబ్బందులకు గురి చేసే విధంగా కొంతమంది అధికారులు కావాలనే  వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశం ఉన్నట్లుగా భావిస్తున్నామని, ఉన్నత చదువులు అభ్యసించి నూతన వ్యవస్థ లో అవినీతి రహిత సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ముఖ్యమంత్రివర్యుల ఆశయాలకు,రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగుల ను చిన్నచూపు చూసే విధంగా వారి మనోభావాలను దెబ్బతీయటం అత్యంత బాధాకరం.


 కారణం ఏమిటంటే మరుగుదొడ్ల వద్ద రుసుము వసూలు చేసేందుకు పట్టభద్రులు పోస్టు గ్రాడ్యుయేట్లు డాక్టరేట్లు అవసరమైతే, చిన్న చిన్న చదువులు చదువుకున్న సామాన్యుల పరిస్థితి గురించి ఆలోచిస్తే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందోనని ఆందోళన కలిగించే విధంగా అధికారుల తీరు ఉండటం అత్యంత బాధాకరం.


 రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రవర్తన వలన వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే అధికారులకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తూ ఉద్యోగుల మనోభావాలు గౌరవించే విధంగా వారికి కేటాయించిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన లో జానీ పాషా అధికారులకు, మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఇట్లు

 ఎండి జానీ పాషా

 రాష్ట్ర అధ్యక్షులు

 గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ రి.నెం:138/2020

Comments