దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించింది.






- తాడేపల్లి పిఆర్ కమిషనర్ కార్యాలయంలో..

- ఉపాధి హామీ మహిళా శక్తి అవార్డుల ప్రధానోత్సవం

- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- 75 మంది ఉపాధి హామీ మేట్ లకు అవార్డులను అందచేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- ఉపాధి హామీ కింద లబ్ధిపొందిన మహిళా రైతులకు సత్మారం

- కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండె, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్యామల తదితరులు



తాడేపల్లి (ప్రజా అమరావతి):


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రతిభ కనపరిచిన మేట్లకు ఉపాధి హామీ మహిళా శక్తి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది.  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అవార్డల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఉపాధి హామీ మేట్లకు శ్రమశక్తి అవార్డులను ప్రధానం చేశారు. అలాగే ఉపాధి హామీ పథకంను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా తమ కుటుంబాలకు అండగా నిలబడిన లబ్ధిదారులను కూడా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండె,  చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మహిళా పక్షపాతి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించింది. మహిళాదినోత్సవం సందర్బంగా సీఎంశ్రీ వైయస్ జగన్ తను ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా గర్విస్తున్నానని స్వయంగా చెప్పడం మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం, నమ్మకాన్ని చాటుతున్నాయి. ఇటువంటి సీఎం పాలనలో ప్రతి ఇంటి లోనూ మహిళలు శక్తివంతులుగా మారుతున్నారు. శ్రీ వైయస్ జగన్ గారు రాష్ట్రంలో చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి చోటా మహిళలను కలవడం, వారితో మమేకమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. పాదయాత్రలో వచ్చిన అంశాలను గ్రహించి నవరత్నాలను మేనిఫేస్టోలో ప్రకటించారు. నవరత్నాల ద్వారా మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేశారు. 


మహిళలే నూరుశాతం మేట్లుగా ఉన్న రాష్ట్రం మనదే:

మహాత్మాగాంధి ఉపాధి హామీ పథకంలో నూరుశాతం మేట్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్రం మనదేనని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిజాయితీ, బాధ్యతాయుతంగా పనిచేసే మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ గారి నిర్ణయంలో భాగంగా ఉపాధి హామీలో మేట్లుగా మీకు ప్రాధాన్యత ఇచ్చాం. మీరు నిజాయితీగా పనిచేయడమే కాకుండా, మిగిలిన వారికి మార్గదర్శకులుగా పనిచేయాలి. గత ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరుకు ఇచ్చే స్కోచ్ అవార్డులు మనకు మూడు వచ్చాయి. తాజాగా స్కోచ్ అవార్డుల ప్రకటనలో ఎపికి మొదటిస్థానం దక్కగా దీనిలో గ్రామీణాభివృద్ధి శాఖ  ప్రధమ స్థానంలో నిలిచింది. ఇదంతా ఈ శాఖలో భాగస్వాములుగా మీరు చేస్తున్న కృషికి నిదర్శనం. 


మహిళలను శక్తివంతులుగా చేయడమే ధ్యేయం:

ఈ ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ పథకాలను మహిళల ద్వారానే ప్రతి కుటుంబానికి అందిస్తోంది. ఆయా పథకాల ప్రారంభం సందర్భంగా 

క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం గారు మీట నొక్కితే నేరుగా మహిళా లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమ చేస్తున్నారు. కరోనా కష్టసమయంలో రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గినా, సీఎం గారు చెప్పిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించారు. 2014ఎన్నికలో  మహిళాసంఘాలకు ఉన్న రూ.14,200 కోట్ల రుణాలను తీరుస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. సీఎం అయిన తరువాత 2016 నుంచి మహిళాసంఘాలకు రావాల్సిన వడ్డీలేని రుణాలను ఆపివేశారు. అంతేకాకుండా స్వయం సహాయక గ్రూప్ లు నిరర్థక ఆస్తులతో నిర్వీర్యం అయ్యేందుకు కారకుడయ్యాడు. శ్రీ వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలను బలోపేతం చేశారు. డీఫాల్ట్ అయినా వాటికి కూడా చేయూత అందించి,  వాటిని నూరు శాతం యాక్టీవ్ గా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చొరవ తీసుకున్నారు. దేశంలో 99 శాతం రికవరీ అవుతున్న రాష్ట్రంగా ఎపి ప్రత్యేకతను చాటుకుంటోంది. అమ్మ ఒడి  కింద మహిళలకు నేరుగా సొమ్మును జమ చేస్తున్నారు. ప్రతినెలా పెన్షన్ల కోసం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాము. 31 లక్షల ఇంటిపట్టాలు మహిళా పేరుమీదనే ఇచ్చాం. 45-60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు  నాలుగేళ్ళలో రూ.75 వేల చొప్పున వైయస్ఆర్  చేయూత కింద అందస్తున్నాం. ఈ పథకం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా మార్చి పెద్దపెద్ద కంపెనీలతో వ్యాపార భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నాం. 


కుటుంబాలకు మీరు ఆర్థిక శక్తిగా మారాలి

కుటుంబానికి కేంద్రంగా, ఆర్థికశక్తిగా మహిళలు మారాలి. మీ పిల్లలకు మంచి విద్య, వైద్యంతో చక్కటి భవిష్యత్తును అందించాలి. ఈ లక్ష్యంతోనే సీఎం శ్రీ వైయస్ జగన్ నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లోనూ మహిళలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవుల్లో యాబైశాతం మహిళలకే కట్టబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఉపాధి హామీ పథకంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల జాబ్ కార్డులు ఉంటే అందులో 64 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉపాధి హామీ మేట్లుగా మీరు చేసే మార్కింగ్, పని ప్రదేశంలో వనరుల కల్పన, మస్టర్లు రాయడం పారదర్శకంగా చేస్తున్నారు. అందుకే ఎక్కువ మంది మహిళా మేట్లపై నమ్మకంతో ఉపాధి హామీ పనులకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.13 లక్షల మంది మహిళలు మేట్లుగా ఉపాధి హామీ పథకంకు కీలకమైన స్థానంలో ఉండి పనిచేస్తున్నారు. 

గత ఏడాది మనం 25.92 కోట్ల పనిదినాలను చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు నాటికి కనీసం 24 కోట్ల పనిదినాలు పూర్తి చేసేలా మేట్లు చొరవ తీసుకోవాలి.

Comments