విద్యార్ధి మృతి బాధాకరం
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలురకు పరామర్శ
విజయనగరం, మార్చి 04 (ప్రజా అమరావతి (
:
కురుపాంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బి.సి.బాలుర గురకులంలో పాముకాటుకు గురై ఒక విద్యార్ధి మరణించడం బాధాకరమని జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విచారం వ్యక్తంచేశారు. పాముకాటు ఘటన దురృదృష్టకరమని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మృతి చెందిన విద్యార్ధి రంజిత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి గారి దృస్టికి తీసుకువెళ్లి ఆ విద్యార్ధి కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
గత అర్ధరాత్రి సమయంలో పాముకాటుకు గురై స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్దులను జెడ్పీ ఛైర్మన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఘటన జరిగిన వెంటనే స్పందించి విద్యార్ధులను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారని, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ ఘటనపై సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ముందుగా కురుపాం సిహెచ్‌సిలో, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అయితే పార్వతీపురం నుంచి మరింత మెరుగైన చికిత్సకోసం తరలించాలని వైద్యుల సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ మేరకు తిరుమల ఆసుపత్రిలో చికిత్స అందించారని వెల్లడించారు. ప్రస్తుతం ఐ.సి.యు.లో చికిత్స పొందుతున్న ఇద్దరు వైద్యులకు మెరుగైన వైద్యసహాయం అందించి వారిద్దరి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వం బి.సి. గురుకులాలను ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని ఎలాంటి ఏర్పాట్లూ లేకుండానే గురుకులాలను తగిన వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారని అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఈ విద్యాసంస్థలకు శాశ్వత వసతి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.
addComments
Post a Comment