ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక



నెల్లూరు,మార్చి 9 (ప్రజా అమరావతి):-ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


చెన్నై నగరంలో జాతీయ విపత్తు నిర్వహణ ఆ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు తో రెండు రోజులపాటు నిర్వహించిన తొలి ప్రాంతీయ విపత్తు నిర్వహణ అధికారుల సమావేశంలో రెండవ రోజు బుధవారం జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల  సమయంలో ఏ విధంగా నష్ట నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టారో వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో తుఫానులు, భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు  జిల్లా ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం  నివారించుకునేందుకు, నష్టాలను సాధ్యమైనంతవరకు తగ్గించుకునే విధంగా తక్షణమే స్పందించి సహాయ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందన్నారు.  భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందించే తుఫాను  హెచ్చరికల  ఆధారంగా ప్రజలను ముఖ్యంగా మత్స్యకారులను అప్రమత్తం చేసి చేపల వేట కోసం సముద్రం లోకి వెళ్ళకుండా  నిరోధించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, వైద్యాధికారులు తదితర జిల్లా అధికార యంత్రాంగం మొత్తం నిరంతరం నిఘా ఉంచి జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు.  లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మానవులు,  జంతువుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించేందు కోసం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.  ఇందుకోసం ముందుగా తుఫాను షెల్టర్ భవనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జలాశయాల్లోకి చేరుకునే వరదనీరు ఎప్పటికప్పుడు అంచనా వేసి జలాశయం దెబ్బతినకుండా నీటిని దిగువకు విడుదల చేయాలన్నారు. జిల్లా కేంద్రాల తో సహా వరద ప్రభావిత మండల కేంద్రాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ తో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసి తుఫాను సంబంధిత ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు తక్షణమే స్పందించి సహాయక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. కావలసినంత  అవసరమైన సిబ్బందిని  తుఫానులు, వరదల సహాయ కార్యక్రమాల కోసం ముందుగా నియమించు కోవాలన్నారు. వారికి ముందుగా సామర్థ్యం పెంపుదల కోసం, పనితీరు మెరుగు పరచడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్యశిబిరాలు, సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. పశు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి టీకాలు వేయించాలన్నారు. తుఫాను వరద బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రాల్లో ఆహారము, మంచినీళ్లు తదితర వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.  తుఫాన్లు వరదలకు దెబ్బతిన్న రహదారులు, జలవనరులను తాత్కాలికంగా వెంటనే పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.  అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాల్సి ఉంటుందన్నారు.  వరదలు తగ్గుముఖం పట్టాక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరద బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పు,  నూనె తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలను భాగస్వాములను చేసి వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

Comments