ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా ఘనంగా మహిళా జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానం

 *ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా ఘనంగా మహిళా జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానం.*


*హాజరైన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్.*


       హైదరాబాద్ (ప్రజా అమరావతి):: తెలంగాణా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందని, ప్రధానంగా మహిళా, శిశు సంక్షేమంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐ.టి. శాఖా మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను రాష్ట్ర మున్సిపల్, ఐ.టి శాఖ మంత్రి కె.టీ.రామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ లు నేడు  అందచేశారు. వివిధ పత్రికా, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్నదాదాపు 80 మందికి పైగా మహిళా జర్నలిస్టులకు నేడు సాయంత్రం బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ప్రత్యేక పురస్కారాలు అందచేశారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ కూడా హాజరయ్యారు.  


      ఈ సందర్బంగా మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ ఎనిమిదేళ్లలో మహిళాభ్యుదయం, శిశు సంక్షేమ రంగంలో గణనీయమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా శిశు మరణాలు, నియో నాటల్ మరణాలు, మెటర్నల్ మరణాలు గణనీయంగా తగ్గాయని, దీనికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతేనని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విజయాలకుసాక్ష్యమని తెలియచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రం లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పధకాన్ని అందచేశామని, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలతో రాష్ట్రంలో ఆసుపత్రులలో ప్రసవాలసంఖ్య పెరిగిందని అన్నారు. ఒక్క, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లోనే నెలకు 300 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయని ఉదహరించారు. దీనితో, గతంలో మాదిరిగా, సీజీరియన్ ఆపరేషన్లు జరగడంలేదని, రాష్ట్రంలో 17 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందచేశామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 300 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

 

         పాశాత్య దేశాలతో పోల్చితే మన దేశంలోని మహిళలు బహుముఖ విధులను నిర్వహిస్తారని, ముఖ్యంగా మీడియా రంగంలోని మహిళలు మరింత కఠినతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క రంగంలోని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చిరు సత్కారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలతో అబివృద్ది, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను  ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తా కథనాలను రాయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని, విధ్యుత్ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే దీనిలోనూ 50 శాతం మహిళలే ఉన్నారని వెల్లడించారు. కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్తారనే పేరున్న లైన్ మెన్ ఉద్యోగాలలోనూ 217 మహిళలను నియమించామని, ఇలాంటి వాటిపై విజయ గాధలపై ప్రత్యేక కధనాలు రాసి మహిళలకు స్ఫూర్తి నింపాలని జర్నలిస్టులకు సూచించారు. 


  ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత మహిళాభ్యుదయాన్ని చూడాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విద్యాలయం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల మహిళల తరపున కృతఙ్ఞతలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా అవి స్వీకరించే అమ్మాయిల కళ్ళ నుండి ఆనంద భాష్పాలు  రావడం చూస్తున్నామని పేర్కొన్నారు. 


    రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ మాట్లాడుతూ, నేడు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో షీ- టీమ్ లు ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు తమ ఉద్యోగ విధులనుండి  అర్ధ రాత్రిళ్ళలో నైనా క్షేమంగా ఇంటికి చేరుకుంటామని ధైర్యం ఏర్పడిందని గుర్తు చేశారు. 

         ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొట్ట మొదటి సారిగా రాష్ట్రం లోని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫ్రీలాన్సర్ రంగాల్లోని మహిళా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు. ముఖ్యంగా పలువురు జర్నలిస్టులు తమకుటుంబ సభ్యులతో కలసి హాజరు కావడంతో పాటు మంత్రులతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు...