ఆత్మ స్థైర్యమే ఆయుధం కావాలి మహిళలకు మహిళలే అండగా నిలవాలి

 

  ఘనంగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

ఆత్మ స్థైర్యమే ఆయుధం కావాలి 

మహిళలకు మహిళలే అండగా నిలవాలి


 

సమాజ మనుగడకు మహిళే  కీలకం 

సభలో మాట్లాడిన పలువురు వక్తలు 

విజయనగరం, మార్చి  08 (ప్రజా అమరావతి):  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆధ్వర్యం లో జిల్లాలో ఘనంగా జరిగాయి. కల్లెక్టరేట్ ఆడిటోరియంలో కేర్ ఇండియా, ఐ.సి.డి.ఎస్ శాఖ  ద్వారా వేడుకలు నిర్వహించారు.  స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం లో జిల్లా యంత్రాంగం తరఫున అన్ని శాఖల సమన్వయం తో నిర్వహించారు.   మహిళలకు, పిల్లలకు అవసరమగు  వ్యక్తిగత పరిశుభ్రత, బ్రెస్ట్ కాన్సర్, మానసిక సమస్యలు, వత్తిడి ని ఎదుర్కోవడం తదితర అంశాల పై సంబంధిత నిపుణులు వివరించారు.  అదే  విధంగా డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లిటరసీ, , ముద్ర తదితర  రుణాల గురించి  బ్యాంకర్లు అవగాహన కలిగించారు.  ఈ సందర్భంగా పలు రంగాలలో ఉత్తమ సేవలు అందిసున్న మహిళలను జ్ఞాపికలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మహారాజ  సంగీత నృత్య  కళాశాల విద్యార్ధుల వీణా నాదం,  సంగీత కార్యక్రమాలు, అంబేద్కర్ బాలయోగి గురుకుల పాఠశాల , చీపురుపల్లి విద్యార్ధులు ప్రదర్శించిన గేయాలు, నృత్యాలు అలరించాయి.

మహిళా భివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది:    జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు 

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను మహిళల అభివృద్ధి కోసం అమలు చేస్తూ  మహిళా సాధికారత కు  కట్టుబడి ఉందని అన్నారు.  నామినేటెడ్, కార్పొరేషన్  పదవుల్లో మహిళలకు 50 శాతం పై బడి అధికారాలను ఇచ్చారని పేర్కొన్నారు.  గతం లో  స్వర్గీయ ముఖ్యమంత్రి  వై.ఎస్.  రాజశేఖర్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం కృషి చేసారని గుర్తు చేసారు.  నేటి ముఖ్యమంత్రి కూడా అదే బాట లో నడుస్తూ మహిళల  సంక్షేమానికే పెద్ద పీట  వేస్తున్నారన్నారు.  ప్రస్తుత జిల్లా కలెక్టర్ సూర్య కుమారి నేతృత్వం లో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో  మహిళల సంఖ్య  మరింత పెరగాలని ఆకాంక్షించారు.

ఆడ పిల్లల సంఖ్య తగ్గితే జాతి అంతరించిపోతుంది :  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి 

స్త్రీ ఉంటేనే సమాజ మనుగడ ఉంటుందని, రోజు రోజుకు ఆడ పిల్లల సంఖ్య తగ్గడం ప్రమాదకరమని గుర్తించాలని కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు.  ఆడ పిల్లల సంఖ్య తగ్గడమంటే జాతి అంతరించిపోవడమేనని,  దీని పై ప్రతి ఒక్కరు ఆలోచించాలని, ఈ విషయం పై ప్రధానంగా  ఆశ, అంగన్వాడి కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని  అన్నారు. విద్యా కాలం లో వివాహాలు జరగడం ఆడ పిల్లలకు శాపమని ,  అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా  తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు వారిని కట్టడి చేయాలనీ అన్నారు.  ఆడవాళ్లకు ఆడవాళ్లే అండగా ఉండాలని, శత్రువు అనే మాటను తిరిగి రాయాలని పిలుపునిచ్చారు.  ఎవరైనా మహిళ బాధల్లో ఉంటె  వీలైతే సహకరించాలే కాని అవహేళన చేయరాదని హితవు పలికారు.  చేస్తున్న ఉద్యోగం లో  చిన్నా పెద్ద అనే తేడా లేకుండా   సమర్ధత ను నిరూపించుకోవాలని , తద్వారా తన శక్తి ఏంటో  తెలియజేయాలని అన్నారు.  మహిళలు తమ చుట్టూ తామే రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలని అన్నారు. 

మహిళా సాధికారత ఇంటినుండే మొదలవ్వాలి:  మేయర్ వెంపడాపు  విజయలక్ష్మి 

మహిళలను  ఇంటిలో వారు గౌరవిస్తే  బయట వారు కూడా  గౌరవిస్తారని  మేయర్ విజయలక్ష్మి తెలిపారు.  మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి పధకాన్ని మహిళల పేరునే ఇస్తున్నారని అన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తో మహిళలు వారి  కాళ్ళ పై వారు నిలదొక్కుకోవాలని కోరారు. 

మహిళలకు మహిళలే అండగా నిలవాలి :  జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ 

జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ మాట్లాడుతూ  మహిళలు తమ కోసం తాము కొంత సమయాన్ని కేటాయించుకోవాలని , తన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా  చూసుకోవాలని అన్నారు.  అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారని, అయితే ఈ సంఖ్య ఇంకా పెరగాలని ఆకాంక్షించారు.   ప్రతి మహిళా  ఇంకో మహిళను గౌరవించాలని, విమర్శలు తగవని, ఎన్నో కస్తాల కోర్చి ఈ స్థితికి చేరిందని గ్రహించాలని అన్నారు.  ఆడ, మగ పిల్లల్ని సమానంగా పెంచాలని ఇంటి పనుల్లో కూడా అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.  మహిళల భద్రత, రక్షణ  కోసం దిశా యాప్ పని చేస్తోందని, ప్రతి ఒక్కరు తప్పకుండా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమం లో మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ  73, 74 రాజ్యాంగ సవరణ తో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించగా ఈ ప్రభుత్వం  స్థానిక సంస్థల లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి నిజమైన మహిళా సాధికారతకు  నిదర్శన0గా నిలిచిందన్నారు. .  డి.సి.ఎం.ఎస్. ఛైర్పర్సన్ డా. భావన మాట్లాడుతూ  మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే  కుటుంభం, సమాజం ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లా  వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ వాకాడ నాగేశ్వర రావు,  డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు ప్రసంగించారు. జెడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి లు,  పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పలు శాఖలలో క్షేత్ర స్థాయి లో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీస్, వైద్య, ఐ.సి.డి.ఎస్. విద్య, వ్యవసాయ, డ్వాక్రా సంఘాల మహిళలకు , మహిళా రైతులకు,  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి  లక్ష్మీ రాజ్యం, సంయుక్త కలెక్టర్ లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, మయూర్ అశోక్, డి.ఆర్.డి.ఏ పి.డి. డా. అశోక్ కుమార్,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments