- సచివాలయంలో ఎపి జెన్క్ అధికారులతో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్ లపై ఇంధన శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
- మూడు నెలల్లో ఎన్టిటిపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని ఆదేశం
- కృష్ణపట్నం స్టేజ్ -2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయండి
- ఈ రెండు ప్లాంట్ లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల అదనపు విద్యుత్
- కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం
- ప్రజలకు మెరుగైన విద్యుత్ ను అందించడమే లక్ష్యం
- దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ కోతలు తక్కువ
మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి:
అమరావతి (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎపి జెన్క్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఎపి జెన్క్ అధికారులతో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్ట్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....
దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా తీవ్ర విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తిలో లోటు ఉంది. అయినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విద్యుత్ కోతల విధింపును తక్కువగానే విధిస్తున్నాం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించాల్సిన బాధ్యత ఇంధన శాఖపై ఉంది. సీఎం శ్రీ వైయస్ జగన్ ఎంతో నమ్మకంతో మనకు ఈ బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా, ప్రజలకు అసౌకర్యం లేకుండా మెరుగైన విద్యుత్ ను అందించాలి. ఇందుకోసం విద్యుత్ రంగంలోని అధికారులు శ్రద్ద తీసుకోవాలి.
కృష్ణపట్నం, ఎన్ టిటిపిఎస్ థర్మల్ స్టేషన్లలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం వున్న ప్లాంట్ లను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. ఎన్ టిటిపిఎస్ లో స్టేజ్ -5 ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి. వెంటనే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. అలాగే కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను కూడా జాప్యం లేకుండా పూర్తి చేయాలి. ఈ రెండు ప్లాంట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రాధాన్యతగా ఈ ప్లాంట్ల నిర్మాణంను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి.
పోలవరం, సీలేరు జల విద్యుత్ ప్రాజెక్ట్ లలో జరుగుతున్న పనులను కూడా వేగవంతం చేయాలి. ఈ రెండు ప్రాజెక్ట్ ల ద్వారా అదనంగా రాష్ట్రానికి జల విద్యుత్ రూపంలో 1190 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. థర్మల్ విద్యుత్ కన్నా జల విద్యుత్ ఉత్పత్తికి వ్యయం కూడా తక్కువ అవుతుంది. ఈ మేరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ, జలవనరుల అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలి. ఎక్కడైనా పెండింగ్ లో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. కేంద్రంతో సంప్రదించి అవసరమైన అనుమతులను తీసుకువస్తాం.
రాష్ట్రంలో ఎన్టిటిపిఎస్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు మొత్తం 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాయలసీమ టిపిపి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఎస్డిఎస్టిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా మొత్తం 5010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. జలవిద్యుత్ ప్లాంట్ల ద్వారా మొత్తం 1774 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు సోలార్ ప్రాజెక్ట్ ల ద్వారా 405 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్ల జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 2024-25 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు ముమ్మరం చేస్తున్నాం. లోయర్ సీలేరు నుంచి 230 మెగావాట్ల జల విద్యుత్ ను 2024-25 నాటికి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నాం.
800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం స్టేజ్ -2 నిర్మాణంకు ఇప్పటి వరకు మొత్తం 7705.14 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్లాంట్ కు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 3.548 మిలియన్ టన్నుల కోల్ లింకేజీకి అనుమతులు లభించాయి. 2021 నవంబర్ లోనే యూనిట్ సింక్రనైజేషన్ ప్రారంభించాం. గతనెలలో ట్రయల్ ఆపరేషన్స్ ను విజయవంతంగా నిర్వహించాం. ఎన్టిటిపిఎస్ 5వ స్టేజ్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.6308.62 కోట్లు వ్యయం చేశాం. అతి త్వరలోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం.
సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి, జెన్క్ డైరెక్టర్ థర్మల్ చంద్రశేఖర్ రాజు, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment