సి.పి.ఎస్.పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ
అమరావతి,ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి): కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 25వ తేది సోమవారం జిఓ సంఖ్య 716 ద్వారా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సభ్యులుగా మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సోమవారం పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అమరావతి సచివాలయం 2 వ బ్లాకులో సమావేశమై సిపిఎస్ అంశంపై సుదీర్ఝంగా చర్చించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తదుపరి సాధ్యమైన మేర మేలు చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. అయితే పాత ఫించను పథకం అమలు అనేది దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సవాలుగా పరిణమించిన అంశంగా తయారైందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, భవిష్యత్ తరాల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుంటే పాత ఫించను పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్దిచేకూర్చే విధంగా రాష్ట్రంలో హామీ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసే విధంగా ఈ ఫించను పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ తదుపరి ఉద్యోగులకు సాధ్యమైనంత మేర భద్రత కల్పించే విధంగా పించను పథకాన్ని రూపొందించి అమలు పర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. పదవీ విరమణ తదుపరి ఉద్యోగులకు సాధ్యమైన మేర భద్రత కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పాత ఫించను పథకం మరియు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) రెండు పించను పథకాలను సమన్వయ పరుస్తూ మధ్యే మార్గంగా రాష్ట్రంలో హామీ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా మంచి ఫించను పథకాన్నిరూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందజేస్తే వాటిని కూడా సాధ్యమైనంత మేర పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు మంచి ఫించను పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
సమావేశం ప్రారంభంలో ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ మాట్లాడుతూ సిపిఎస్ అంచనాలను ఎందుకు సంస్కరించాలి, పెన్షన్ సంస్కరణ సవాళ్లు, పాత పెన్షన్ పథకం అమలులో ఆర్థిక సుస్థిరత పరిశీలన మరియు నూతనంగా ప్రతిపాదించే ఆంద్రప్రదేశ్ హామి పింఛను పథకం వివరాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు .
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ.ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) శశిభూషణ్ కుమార్, జిఏడి సర్వీసెస్ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో పాటు ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ (పీ ఆర్ టి యు) అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపిటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయ రాజు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment