ఇఫ్తార్ విందులు ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయి..



**ఇఫ్తార్ విందులు ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయి..*


*


* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్.బి అంజాద్ బాషా*


* *మనిషి సత్ప్రవర్తనలో నడిచేందుకు.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయి : జిల్లా కలెక్టర్*


కడప, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు.. ప్రజల మధ్య ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, యస్.బి అంజాద్ బాషా పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. కడప నగరంలోని నుర్జాహాన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన "ఇఫ్తార్ విందు"  కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ, అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేని పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా మాట్లాడుతూ... కులమతాలకు అతీతంగా కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం ఒక్కటని, అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ ఇస్తార్ విందు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ అద్వయరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


యావత్ భారత దేశం శాంతియుతంగా.. సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా.. ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా ఎనలేని అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి.. కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ఇఫ్తార్ విందు ఆతిధ్యం ఇస్తున్న అత్యంత ప్రాచుర్యం ఉన్న నూర్జహాన్ షాదీ ఖానా ను రూ.85 లక్షలు వెచ్చించి.. అధునాతన వసతులతో అభువృద్ది చేయడం జరిగిందన్నారు. 


జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు మాట్లాడుతూ.. పవిత్ర దైవారాధనకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలం అన్నారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయన్నారు.  సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవం అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్ వలీ, ఆర్టీసీ ఛైర్మెన్ మల్లికార్జున రెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం, సోషల్ వెల్ఫేర్ ఛైర్మన్ పులి సునీల్, బీసీ వెల్ఫేర్ అధికారి బ్రహ్మయ్య, స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు,  మైనారిటీ నాయకులు, మత గురువులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



Comments