ప్రకృతి వ్యవసాయం చేసే రైతును దేశానికి గొప్ప సేవకుడిగానే చూడాలి




*ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్‌  జాతీయ స్దాయి సదస్సులో కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*

*ప్రకృతి వ్యవసాయం చేసే రైతును దేశానికి గొప్ప సేవకుడిగానే చూడాలి


*

*వారిని ప్రోత్సహించేలా ఒక విధానం తీసుకురావాలి*

*రైతులకు రివార్డులు ఇవ్వాలి.*

*పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సులలో వెయిటేజీ ఇవ్వాలి.*

*సర్టిఫికేషన్‌ ప్రక్రియ సరళంగా, రైతులకు అందుబాటులో ఉండాలి.*

*వ్యవసాయ యూనివర్శిటీ కోర్సుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు పొందుపరచాలి.* 

*వ్యవస్థీకృతంగా పరిశోధనలు అత్యంత అవసరం*

*ఆరోగ్యంపై ప్రభావాలను పరిశోధించి, ఫలితాలను ప్రజలముందు ఉంచాలి.*


*ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు 20 మిలియన్‌ యూరోల నిధులు ఇవ్వడానికి జర్మనీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.*

*ఈ నిధులతో ఇండో-జర్మనీ గ్లోబల్‌ అకాడమీ ఆన్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది.*

*ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్‌ పనిచేస్తుంది.*


*ప్రకృతి వ్యవసాయంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో 90శాతం నిధులను కేంద్రం భరించాలి.*

*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


అమరావతి: (ప్రజా అమరావతి);

*–సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు*

*–క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.* 



*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....:*

– ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో వినూత్న పద్ధతుల్లో భాగంగా ప్రకృతి వ్యవసాయం అంశంపై నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం. 

– కొన్ని దశాబ్దాలుగా హరిత విప్లవం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో పెద్ద మొత్తంలో దిగుబడులు సాధించాం. 

వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం కోసం నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. 

– ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా దీనిపై దృష్టి సారించాల్సించి ఉంది.  

– రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే కాదు, రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారాన్ని ఉత్పత్తులను విడిచిపెట్టి, ప్రజలందరికీ ఆహార భద్రతను,  మంచి పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. 

– ప్రకృతి వ్యవసాయ విధానాల్లో నేల పునరుత్పత్తి ప్రక్రియ అన్నది అన్నిటికంటే ముఖ్యమైనది. నీటి పరిరక్షణ, పర్యావరణ హిత కార్యక్రమల ద్వారా విస్తృత లబ్ధి అన్నది లక్ష్యాలు కావాలి. 

– ప్రస్తుత తరాల జీవితాలకు భద్రత కల్పించడమే కాదు, భవిష్యత్తు తరాలకు మంచి జీవితాలను, చక్కటి జీవనోపాథిని అదించడానికి ‘సతత హరిత విప్లవం’ (ఎవర్‌గ్రీన్‌ రివల్యూషన్‌)దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేసింది. 

– 2021–22 సంవత్సరంలో 6.3లక్షల మంది రైతులు, 2.9లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం కోసం నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాల్లోని 3009 రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది.

– రాష్ట్రంలోని సాగుచేస్తున్న భూమిలో దాదాపు 5 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం అమలవుతోంది. 

– ఈ లక్ష్యాలతో మేం విశ్రమించడంలేదు. సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులద్వారా వ్యవసాయం విషయంలో మాకు మేముగా సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాం.

– రసాయన ఎరువులు, పురుగుమందులను విస్మరించి సహజ, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు కొనసాగుతున్న ఈ యాత్ర కనీసం 3 నుంచి 5 ఏళ్లపాటు కొనసాగుతుంది. 

– ఇలా ప్రయాణం కొనసాగుతున్న రైతులు తాము సాగుచేస్తున్న భూమిలో ఇప్పటికిప్పుడే రసాయన ఎరువులు, పురుగుమందులను పూర్తిగా వదిలేయమని చెప్పడంలేదు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వాళ్లు క్రమంగా, సజావుగా ప్రకృతి వ్యవసాయం దిశగా వెళ్లేలా ప్రభుత్వం తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తోంది. 

– పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలు చేయడానికి ఆ రైతుకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి, సుస్థిరమైన విధానాల ద్వారా వీరి జీవనోపాధిని మెరుగుపరచడానికి 

ఈ రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోంది. 

– రైతు సంక్షేమం అన్నది మా ప్రభుత్వం ప్రధానమైన భూమిక. ప్రకృతి వ్యవసాయాన్ని సాధ్యంచేసే ప్రక్రియలో రైతు భరోసా కేంద్రాలు( ఆర్బీకేలు) అత్యంత కీలకమైనవి. రైతులకు అందించే సేవలకు ఆర్బీకేలు కేంద్రంగా నిలుస్తున్నాయి. 

– ప్రతి 2వేల జనాభాకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేశాం. రైతుల కోరిన ఏ సేవనైనా వారి గడపవద్దకే ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. ఏ వినూత్న పద్ధతినైనా అన్ని గ్రామాల్లో అతితక్కువ సమయంలో అమలు చేయడానికి ఆర్బీకేలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 

– గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సాగుతున్న చోట్ల మొత్తంగా 10,778 ఆర్బీకే కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. రైతులకు కావాల్సిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తోంది. వీటితోపాటు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్స్‌కూడా అందిస్తోంది.

– రైతులకు సాగు పద్ధతులపై మంచి పరిజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగానే కాకుండా, పంటలకొనుగోలుకేంద్రాలుగా కూడా ఆర్బీకేలు వ్యవహరిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలకు ఒన్‌స్టాప్‌ సెంటర్లుగా ఆర్బీకేలు వ్యవహరిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్స్‌ అందిస్తున్నాయి. కల్తీలను పూర్తిగా నివారిస్తున్నాయి. 


– సాగు చేస్తున్న రైతుల సమాచారాన్ని ఇ– క్రాప్‌ చేయడమేకాకుండా, ఆ డేటాతో ప్రభుత్వ పథకాలను, సేవలను అనుసంధానం చేస్తున్నాయి. 

– రైతులకు శిక్షణ ఇవ్వడమే కాదు, నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పద్ధతులతో వారి వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడం తదితర అంశాల్లో ఆర్బీకేలు దోహదపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్‌లు కూడా ఆర్బీకేల్లో పనిచేస్తున్నాయి. 

– రైతుల ముంగిటకే ఆర్బీకేలు సమృద్ధిగా సేవలు అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన, సక్రమమైన సేవలు అందించడానికి విభిన్న రకాల ల్యాబ్‌లతో ఆర్బీకేలు అనుసంధానమయ్యాయి. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా ఆర్బీకేలు వ్యవహరిస్తున్నాయి. 

– అత్యంత సమర్థుడైన, నైపుణ్యం ఉన్న విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (వీఏఏ) ప్రతి ఆర్బీకేలోనూ ఉంటారు. రైతులకు సాంకేతిక అవగాహన కల్పించడానికి వ్యవసాయం, లేదా ఉద్యానవనాల సాగులో గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లమా సాధించిన వారిని వీఏఏలుగా నియమించాం. రైతులకు బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను నియమించాం.

– రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా అందించడానికి వ్యవసాయ క్షేత్రాల్లో వీఏఏలు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా, పర్యావరణహిత పద్ధతులతో మంచి సాగు పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడులను సాధించేందుకు రైతులకు తోడుగా ఈ కార్యక్రమాలు నిలుస్తున్నాయి. రైతులు కూడా చురుగ్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

– దీంతోపాటు సాగుచేయాల్సిన పంటల ప్రణాళికను సూచించడం, ఆర్బీకేల కార్యక్రమాల పర్యవేక్షించేందుకు, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం.

– వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న 80,359 మంది ప్రగతిశీల రైతులు ఈ మండళ్లలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల్లో రైతుల తరఫున ఈ వ్యవసాయ సలహామండళ్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

–  రాష్ట్రంలో అన్ని సీజన్లలో పండుతున్న వివిధ పంటలు, రకాలు, వాటిని సాగుచేస్తున్న రైతుల వివరాలను ఇ– క్రాపింగ్‌ ద్వారా నమోదు చేస్తున్నాం. ఇది రైతులకు అందిస్తున్న మరో కీలకమైన సేవ. వైయస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, డాక్టర్‌ వైయస్సార్‌ ఉచిత పంటలబీమా, సాగుచేస్తున్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటలకు ఎంఎస్‌పీ ధరలు... ఇవన్నీకూడా సమర్థవంతంగా అమలు చేయడంలో ఇ–క్రాప్‌ డేటా ఉపయోగపడుతుంది. ఇ– క్రాప్‌ చేయించుకున్న రైతులకు భౌతికంగా రశీదు ఇవ్వడంతోపాటు, డిజిటల్‌ రశీదులుకూడా ఇస్తున్నాం. సామాజిక తనిఖీకోసం వారి పేర్లను ఆర్బీకేల్లో బోర్డులపై ప్రదర్శిస్తున్నాం.

– రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రైతులు పండించిన పంటలకు ఎంఎస్‌పీకన్నా తక్కువ ధరలు వస్తున్న సందర్భంలో నేరుగా మార్కెట్లో జోక్యంచేసుకుని వారికి ధరలు వచ్చేలా ఈ నిధిని వినియోగిస్తున్నాం. ఎంఎస్‌పీ ధరలు నిర్ణయించని పంటలు సాగుచేస్తున్న రైతులను కూడా ధరల స్థిరీకరణ నిధిద్వారా ఆదుకుంటున్నాం.

– రాష్ట్రంలో హెక్టారులో సగం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం మంది ఉన్నారు. 1 హెక్టారు, అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 70శాతం మంది ఉన్నారు. వైయస్సార్‌ రైతు భరోసా/పీఎం కిసాన్‌ ద్వారా ఈ రైతులకు అండగా నిలుస్తున్నాం. ఏడాదికి రూ.13500 ఆర్థిక సహాయాన్ని పెట్టుబడి సహాయంగా వీరికి అందిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 80శాతం పంటలకు, 50 నుంచి 80శాతం వరకూ పెట్టుబడి సహాయాన్ని వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా ఈ సన్న, చిన్నకారు రైతులకు అందిస్తున్నాం. 

– అంతేకాకుండా రైతులకు ఉచితంగా పగటిపూటే 9 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. మా రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. 


– ప్రకృతి వ్యవసాయాన్నికూడా ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకున్నాం. 

– రసాయన ఎరువులు, పురుగుమందులతో రైతులు గడచిన 30–50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. వీరంతా రసాయన ఎరువులు, పురుగుమందులను విడిచిపెట్టి, పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అన్నది అంత సులభమైన పనికాదు. అలా చేయమనికూడా మనం అంత సులభంగా రైతులను కోరలేం. 

– కాని అదేసమయంలో... ఇలా ప్రకృతి సాగు విధానాలవైపునకు మళ్లడం అన్నది అత్యంత ముఖ్యమైన రూపాంతరమనే విషయాన్ని రైతులకు నచ్చచెప్పాలి. అనేక శాస్త్ర సాంకేతిక సంస్థలు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల సహకారం, మద్దతుతో దశలవారీగా ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు ముందుకు వేయాలి.  ఈ ప్రక్రియ మొత్తం రైతుల ఇష్టంపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలి. అలా ముందుకు వచ్చే రైతులతో క్రమంగా ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకుసాగాలి.

– వ్యవసాయ శాఖలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. ఆర్బీకేల సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాన్ని చేపట్టింది. 

– ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లేలా రైతులను చైతన్యపరుస్తోంది. ఈ ప్రక్రియలో ఆర్బీకేలకు తోడుగా నిలిచేందుకు ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రైతులను కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌లుగా ఆర్బీకేల్లో పెడుతున్నాం. వీరి ద్వారా రైతులకు శిక్షణ ఇప్పించే కార్యక్రమాలతోపాటు, పంటల వారీగా సాగువిధానాలపై ప్రోటోకాల్స్‌నుకూడా అభివృద్ధిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం, వాటి విధానాలను విస్తరింప చేయడంలో ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయి. 

– ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందురు, ప్రకృతి సాగు వ్యవసాయ విధానాలను మరింతంగా ముందుకు తీసుకెళ్లడంకోసం నిధులు ఇవ్వడానికి జర్మనీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు అనుమతులు చివరి దశలో ఉన్నాయి. ఐదేళ్లలో 20 మిలియన్‌ యూరోల ఆర్థిక సహాయం అందించడానికి జర్మనీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్‌ అకాడమీ ఆన్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్‌ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం భూములు, భవనాలను సమకూరుస్తుంది. మా ప్రయత్నాలకు సహకరిస్తున్నందుకు నీతిఆయోగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

– ఎఫ్‌ఏఓ, యు.ఎన్‌.ఇ.పి, ఐసీఆర్‌ఏఎఫ్, యూనివర్శిటీ ఆఫ్‌ రీడింగ్, యూనివర్శిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, సీఐఆర్‌ఏడీ (ఫ్రాన్స్‌), జీఐజెడ్, కె ఎఫ్‌ డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం, ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ఈ సాగు పద్ధతులను నిర్మాణాత్మంగా విస్తరించడంలో చాలా విలువైనవి.  

– గడచిన మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో చాలా సానుకూల పరిస్థితి ఉందని వెల్లడవుతోంది. పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతోపాటు, ఇప్పుడున్న పద్ధతుల ద్వారా వస్తున్న దిగబడులతో సరాసరిగా ప్రకృతి వ్యవసాయం దిగుబడులు ఉండడంతోపాటు వరదలను, కరువును, చీడపీడలను తట్టుకుంటున్నాయని, స్వతంత్ర పరిశోధనలు ద్వారా వెల్లడవుతోంది. 

– జీవ వైవిధ్యంతోపాటు, మంచి పౌష్టికాహారం లభిస్తోందని, ఆరోగ్యంపై మంచి సానుకూల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. 



*–జాతీయ స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అంశాలను మీ ముందుకు తెస్తున్నాను.* 

– ప్రకృతి వ్యవసాయంవైపునకు మళ్ళిన రైతును ఈ దేశానికి గొప్ప సేవకుడిగానే భావించాలి. వారిని తగిన విధంగా చైతన్యపరచాలి, ప్రోత్సహించాలి. ఈ విషంలో ఒక సానుకూల విధానాన్ని తీసుకురావాలని నీతిఆయోగ్‌ను కోరుతున్నాను. 

– ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వల్ల రసాయన ఎరువులపై సబ్సిడీ భారం తగ్గుతుంది. దీనిస్థానంలో ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న రైతులకు రివార్డుల ఇచ్చే విధానం రావాలి.

–  పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలి. కర్బణీకర లక్ష్యాలను చేరుకోవడంలో,  క్లైమేట్‌ ఛేంజ్‌ మిటిగేషన్‌ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రాష్ట్రాలు దేశానికి సహాయకారిగా నిలుస్తున్న విషయాన్ని గుర్తించాలి.

–  ప్రకృతి మరియు సేంద్రీయ వ్యవసాయానికి ధృవీకరణ పద్ధతులు రైతులకు స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి. 

– వ్యవసాయ యూనివర్శిటీ కోర్సుల్లో ప్రకృతి వ్యవసాయం/ సేంద్రీయ వ్యవసాయంపై పాఠ్యాంశాలను పొందుపరచాలి. 

– ప్రకృతి వ్యవసాయంపై వ్యవస్థీకృతంగా పరిశోధనలు కొనసాగాలి. ప్రకృతి వ్యసాయ పద్ధతుల్లో ఉత్పత్తులను వినియోగించడంవల్ల మరియు ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ద్వారా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల వాడకం వల్ల ఆరోగ్యంపై ప్రభావాలను  పరిశోధించాలి. ప్రజలను చైతన్య పరచడానికి ఈ పరిశోధనలను వారి ముందు పెట్టాలి.

– ప్రకృతి వ్యవసాయం వెళ్తున్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఉదారంగా ఉండాలి. నిధుల కేటాయింపులో భిన్నమైన విధానాలు ఉండాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు 60:40 పద్ధతుల్లో కేంద్రం, రాష్ట్రం వాటాలను నిర్దేశించారు. ఆమేరకు నిధులు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, 90:10 నిష్పత్రిలో కేంద్రం, రాష్ట్రాలు వాటాలను నిర్దేశించేలా నిధులు ఇవ్వాలని కోరుతున్నాను. 

ప్రకృతి వ్యవసాయం వైపునకు రైతులను మళ్లించేలా చేయడానికి అయ్యేఖర్చు కన్నా రసాయన ఎరువుల సబ్సిడీ కోసం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ.

*సీఎంకు  నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ ప్రశంసలు:*

– ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సదస్సు దష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

– ప్రకృతి వ్యవసాయ విధానాలను ఏపీ ఆచరణలో పెట్టింది. దీనికోసం ఏపీ సీఎం ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకున్నారు.

– దీనికోసం వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

– ప్రకృతి వ్యవసాయంలో ఏపీ ముందడుగు వేసింది.

– ఆర్బీకేలపై నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ ప్రశంసలు

–నేను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించాను

–ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయం



ఈ సదస్సులో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సీహెచ్‌ హరి కిరణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Comments