సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్

  

నెల్లూరు (ప్రజా అమరావతి);


సమసమాజ  స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్అని, వారిని   స్ఫూర్తిగా తీసుకొని  ప్రతి ఒక్కరు సమసమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని  జిల్లా  కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.


డా.  బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో  డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమీషనర్ జాహ్నవి,  తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో డా.  బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు.  దేశ స్వాతంత్ర్య ఫలాలు  అన్నీ వర్గాల ప్రజలకు ఆందాలన్న లక్ష్యంతో  రాజ్యాంగ అమలుకు కృషిచేసిన డా. బి.ఆర్.అంబేడ్కర్, డా. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల త్యాగాలను ప్రతిఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు.  డా. బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శవంతమైన జీవితాన్ని,  అణగారిన వర్గాల అభ్యున్నతికి  వారు చేసిన సేవలను  ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం వుందన్నారు.  ఎందరో మహనీయుల త్యాగఫలితమే  ఈ రోజు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని,  వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా,  వారు చూపిన మార్గాన్ని  ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు సమాజాభివృద్దికి కృషి చేయాలన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులకు భంగం కల్గకుండా  సమన్యాయాన్ని  అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు  అందేలా కృషి చేస్తూ మంచి ప్రగతిని సాధించేందుకు ప్రతిఒక్కరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. 


జాయింట్ కలెక్టర్  శ్రీ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ,  నేడు అణగారిన వర్గాల ప్రజలు  ఉన్నత స్థానంలో వున్నారంటే, డా. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి ఫలితమేనని అన్నారు.  డా. బాబు జగ్జీవన్ రామ్ చేపట్టిన అన్నీ పదవులకు వన్నె తెచ్చిన మహనీయులు,  వారు తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే  నేడు అణగారిన వర్గాల హక్కుల పరిరక్షకునిగా డా. బాబు జగ్జీవన్ రామ్  దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని శ్రీ హరేంధిర ప్రసాద్ అన్నారు.  కేంద్ర వ్యవసాయ మంత్రిగా  పనిచేసిన కాలంలో  వారు చేపట్టిన ఆహార సంస్కరణల వల్లనే  నేడు ఆహారాన్ని ఇతర దేశాలకు  ఎగుమతి చేసే స్థాయికి చేరామన్నారు. కార్మిక శాఖలో  కార్మికుల హక్కుల పరిరక్షణకు  వారు చేసి కృషి అభినందనీయమన్నారు.  


సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీ చెన్నయ్య,  సర్వ శిక్ష అభియాన్  ఎ.పి.సి  శ్రీమతి ఉషారాణి,  సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రతినిధులు శ్రీ విజయకుమార్  తదితరులు మాట్లాడుతూ,  డా. బాబు జగ్జీవన్ రామ్ గారు సమసమాజ స్థాపనకు  చేసిన కృషిని, వారి చేసిన  సేవలను  గుర్తు చేశారు. 


ఈ కార్యక్రమంలో మెప్మా పి.డి. శ్రీ రవీంద్ర, డి.టి.సి శ్రీ  బి. చందర్, హౌసింగ్ పి.డి శ్రీ వేణుగోపాల రావు, ఐ.టి.డి.ఎ  ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి కనక దుర్గాభవాని, డి.ఎస్.డబ్ల్యూ.ఓ  శ్రీ వెంకటయ్య,  కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీ పి. సుబ్రమణ్యం, వివిధ శాఖల  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.