రాష్ట్రంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్టమైన చర్యలు

 రాష్ట్రంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్టమైన చర్యలు


విశాఖపట్నం,గుంటూరుల్లో ప్రారంభానికి సిద్ధంగా వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 29,30తేదీల్లో మాస్ క్లీనింగ్ కార్యక్రమం

         ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

అమరావతి,28 ఏప్రిల్ (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్నిమరింత మెరుగుపర్చడం తోపాటు ఘన ద్రవ పదార్థాల నిర్వహణపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులోని సిఎస్ సమావేశ మందిరంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ అన్ని గ్రామాలు,పట్టణాల్లో ప్రతిరోజు ఘ ద్రవ వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించేందుకు పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వేస్టు నుండి ఇంధనం తయారు చేసేందుకు విశాఖపట్నం,గుంటూరు క్లస్టర్లలో ఏర్పాటైన ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.వివిధ గ్రామ పంచాయితీలను మ్యాపింగ్ చేసి ఘణ ద్రవ వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ అధికారులను సిఎస్ ఆదేశించారు.లెగసీ వేస్టును వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ లెవెలింగుకు వినియోగించాలన్నారు. గ్రామాలు,పట్టణాల్లో పెద్దఎత్తున పారిశుద్ద్యాన్ని మెరుగు పర్చేందుకు వీలుగా ఈనెల 29,30వ తేదీల్లో మాస్ క్లీనింగ్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.

ఈసమావేశంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి 100 కి.మీల పరిధిలో వేస్టు నుండి ఇంధనం తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు గాను తగిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రాష్ట్రంలో విశాఖపట్నం,గుంటూరు క్లస్టర్లలో ఏర్పాటు చేస్తున్న వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈవిధమైన ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు,పట్టణాలో ప్రారిశుద్ద్యాన్ని మెరుగు పర్చేందుకు పెద్ద ఎత్తున మాస్ క్లీనింగ్ కార్యక్రమాన్నిచేపట్టాల్సిన అవసరం ఉందని అయోధ్యరామి రెడ్డి చెప్పారు.

రాష్ట్ర అటవీ పర్యావరణ,శాస్త్రసాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఘణ ద్రవ వ్యర్ధాల నిర్వహణ,వేస్టు టు ఎనర్జీ తయారీకి క్లస్టర్ అప్రోచ్ విధానం బాగుందని తెలిపారు.ఈఅంశంపై టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి మూడు మాసాలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు.

అంతకు ముందు రాష్ట్ర స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండి పి.సంపత్ కుమార్ రాష్ట్రంలో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణకు తీసుకుంటున్నచర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పారిశుద్ధ్యాన్నిమెరుగుపర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.దీనిలో భాగంగా మొదటి దశలో ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ బ్లూ,గ్రీన్,రెడ్ మూడు రంగులతో కూడిన చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.రెండవ దశ కింద గ్రేడ్-1 ఆపై గల పట్టణాలు,నగరాల్లో పెట్రోల్ లేదా సిఎన్జి ఆటోలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.అలాగే మూడవ దశ కార్యక్రమం కింద 120 పట్టణ స్థానిక సంస్థల్లో 8నుండి 10 వార్డులకు ఒకటి వంతున 243 గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.నాల్గవ దశ కింద పిపిపి విధానంలో 72 పట్టణ స్థానిక సంస్థల్లో తడి,పొడి వేస్టుల తయారీకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.అదే విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా రాష్ట్రంలోని 13 ప్రధాన పట్టణాల్లో మెకనైజ్డ్ స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  విశాఖపట్నం,గుంటూరుల్లో ఒక్కొక్కటీ రోజుకు 1500 టన్నుల సామర్ధ్యంతో 15 మెగావాట్ల విద్యుత్ తయారు చేసే వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.అంతేగాక విజయనగరం జిల్లా బొబ్బిలి,గుంటూరు జిల్లా వినుకొండ,చిత్తూరు జిల్లా పలమనేరుల్లో ఒక్కక్కటి రోజుకు 15 కిలో లీటర్ల సామర్ధ్యంతో కూడిన పీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎఫ్ఎస్టిపి ప్లాంటులు)కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండి సంపత్ కుమార్ వివరించారు.ఇప్పటికే రాజాం,నరసపూర్ లలో నిర్మించిన ప్లాంటు పనిచేస్తున్నాయని తెలిపారు.అంతేగాక బాపట్ల,చీరాల,పొన్నూరు,మార్కాపురంలలో ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నట్టు సంపత్ కుమార్ వివరించారు.

వీడియో లింక్ ద్వారా రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి మరియు కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి జిఎస్ఆర్కె విజయకుమార్,మున్సిపల్ పరిపాలనాశాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఈసమావేశంలో పాల్గొన్నారు.

     

Comments